తమిళంలో ఉదయ్ కిరణ్
కెరీర్ ఆరంభంలోనే వరుసగా మూడు సిల్వర్ జూబ్లీ హిట్లిచ్చిన హీరో ఉదయ్ కిరణ్ సరైన బ్రేక్ కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వరుస ఫ్లాపుల్లోంచి తేరుకోలేని వి'చిత్ర'మైన పరిస్థితిని ఆయన ఎదుర్కొంటున్నారు. తన సినీ గురువు తేజ సైతం ఇదే పరిస్థితిని ఎదుర్కోవడంతో ఉదయ్ కు ఎదురుచూపులు తప్పడం లేదు. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఇటీవల నటించిన 'వియ్యాల వారి కయ్యాలు', 'గుండె ఝల్లుమంది', 'ఏకలవ్ యుడు' చిత్రాలు సైతం బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూశాయి. సక్సెస్ వచ్చినప్పుడు చుట్టూమూగే వారంతా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కాగడా వేసినా కనబడరనడానికి ఆయనే ఓ ఉదాహరణ. అయితే ఒక్క హిట్ వస్తే చాలు మళ్లీ తన సత్తా చూపిస్తాననే ధీమా ఇప్పటికీ ఆయనలో కనిపిస్తోంది. తాజాగా ఆయన కొద్దిపాటి బ్రేక్ అనంతరం ఓ తమిళ చిత్రానికి అగ్రిమెంట్ చేశారు.
ఇలనివేల్ దర్శకత్వంలో నందిని ఆర్ట్స్ పతాకంపై ఈ కొత్త చిత్రం తెరకెక్కునుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి అందిస్తున్న కథతో ఈ చిత్రం రూపొందనుండటం విశేషం. ఉదయ్ కిరణ్ కు జోడిగా మీరాజాస్మిన్ ఎంపికైంది. ఉదయ్ కి తమిళంలో ఇది రెండో చిత్రం. ఆమధ్య కె.బాలచందర్ దర్శకత్వంలో 'పోయ్' చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో తెలుగులో 'అబద్ధం' పేరుతో విడుదలైంది. రెండు భాషల్లోనూ ఆ చిత్రం ఫెయిల్ అయింది. ఈసారి తమిళంలో తన ఉనికిని బలంగా చాటుకోవాలనే పట్టుదలతో ఉదయ్ ఉన్నారు. త్వరలోనే ఉదయ్ కిరణ్ తాజా చిత్రం సెట్స్ పైకి రానుంది. తమిళంలో సక్సెస్ అయి మళ్లీ తెలుగులోనూ ఉదయ్ బిజీ అవుతారని ఆశిద్దాం.
Be first to comment on this News / Article!
|