సునీల్ 'మర్యాద రామన్న'
ప్రముఖ కమెడియన్ సునీల్ 'అందాలరాముడు' చిత్రం తర్వాత మరోసారి కథానాయకుడి అవతారం ఎత్తారు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఆర్క్ మీడియా వర్క్ లిమిటెడ్ నిర్మిస్తున్న చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ కొత్త చిత్రం షూటింగ్
ప్రారంభోత్సవం హైద్రాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం జరిగింది. సునీల్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి డి.సురేష్ బాబు క్లాప్ ఇవ్వగా, తమ్మారెడ్డి భరద్వాజ కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘువేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. షూటింగ్ ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రవితేజ విచ్చేసి చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.
రాజమౌళి మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాతలతో గతంలోనే ఓ సినిమా చేయాలనుకున్నప్పటికీ తన బిజీ వల్ల సాధ్యం కాలేదన్నారు. రొటీన్ కు భిన్నంగా కొత్త పద్ధతిలో కామెడీ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు చెప్పారు. వర ముళ్ళపూడి చెప్పిన స్టోరీ లైన్ చాలా బాగుందన్నారు. అందుకు తగ్గట్టుగానే సునీల్ ను హీరో ఎంపిక చేసుకున్నామని అన్నారు. రాయలసీమ నేపథ్యంలో 80 శాతం గ్రామీణ వాతావరణంలో ఈ చిత్రం ఉంటుందన్నారు. దీనికి 'మర్యాద రామన్న' అనే టైటిల్ ను అనుకుంటున్నామని చెప్పారు. సునీల్ పాత్ర సీరియస్ గా ఉంటూనే మంచి హాస్యం పంచుతుందనీ, ప్రసాద్ ల్యాబ్స్ కు చెందిన నాగినీడు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారనీ చెప్పారు. అలాగే బ్రహ్మానంద, హీరోయిన్ పాత్రలో సలోని నటిస్తున్నారని చెప్పారు. సునీల్ మాట్లాడుతూ, రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నానని తెలిసినప్పుడు, కథ విన్నప్పుడు మంచి కిక్ ఫీలయ్యానని చెప్పారు. హీరో పాత్ర కోసం రాజమౌళి కోరిక మేరకు కొంత బరువు కూడా తగ్గానని అన్నారు. ఈ చిత్ర కథ బాగా కుదరడంతో 'అందాలరాముడు' తర్వాత మళ్లీ హీరోగా నటిస్తున్నానని అన్నారు. పలు టీవీ సీరియల్స్ నిర్మించిన తమకు ఇది తొలిచిత్రమని నిర్మాతల్లో ఒకరైన శోభు యార్గగడ్డ తెలిపారు. ఈనెలలో నలుగైదు రోజులు, జూలై, ఆగస్టు మాసాల్లో షూటింగ్ జరుపుతామని అన్నారు. మరో నిర్మాత ప్రసాద్ దేవినేని కూడా హాజరయ్యారు. ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, రమా రాజమౌళి స్టైలింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Be first to comment on this News / Article!
|