ఎల్బీ శ్రీరాం 'బిస్లరి బాటిల్'
ప్రముఖ నటుడు ఎల్.బి.శ్రీరామ్, నటి పావలా శ్యామల ప్రధాన పాత్రధారులుగా శ్రీచంద్ దర్శకత్వంలో రూపొందిన షార్ట్ ఫిల్మ్ 'బిస్లరి బాటిల్' (ఏ కూల్ ఫీల్). శ్రీ ధ్రువ క్రియేషన్స్ పతాకంపై జి.కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసాద్ ల్యాబ్స్ లో పలువురు సినీ ప్రముఖులు కోసం ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యువహీరో వంశీకృష్ణ, ఫైట్ మాస్టర్ విజయ్, ఎల్బీ శ్రీరామ్, పావలా శ్యామల, దర్శకుడు శ్రీంచద్, నిర్మాత జి.కృష్ణ, సహనిర్మాత జి.బాలు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, సినిమా చూసినంత సేపూ తన అమ్మానాన్నలే గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టానని చెప్పారు. నటీనటులు తమ పాత్రలను చక్కగా రక్తికట్టించారనీ, మాటలు తక్కువైనా మంచి పంచ్ ఉందనీ, దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారనీ ప్రశంసించారు, హైద్రాబాద్ లో జనవరిలో జరిగే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శించి అవార్డు రావడానికి కృషి చేస్తామని అన్నారు. ఇందులో తాను నటించినప్పటికీ సినిమా చూసి చాలా ఆశ్చర్యపోయాయని ఎల్బీ శ్రీరాం అన్నారు. కొన్ని సన్నివేశాలు సాంకేతిక లోపం వల్ల మిస్సయ్యాయనీ, రీషూట్ చేసేందుకు డేట్లు అడ్జెస్ట్ కాలేదన్నారు. అయితే ఆయా చోట్ల ఉపయోగించిన చక్కని ఆర్ఆర్ (రీరాక్రిండ్) ఫీల్ తో ఆలోపాన్ని దర్శకుడు చందు చక్కగా కవర్ చేశారని అన్నారు. తన టాలెంట్ నిరూపించుకునేందుకు దర్శకుడు చందు ఈ షార్ట్ ఫిల్మ్ రూపొందించారనీ, ఆయన వర్కింగ్ స్టైల్ చాలా బాగుందని వంశీకృష్ణ పేర్కొన్నారు. చందు మాట్లాడుతూ, తాను రాఘువ లారెన్స్ దగ్గర 'మాస్', 'స్టైల్', 'డాన్' తదితర చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసినట్టు చెప్పారు. తనలోని టాలెంట్ ను నిరూపించుకునే ఉద్దేశంతోనే ఈ షార్ట్ ఫిల్మ్ కు దర్శకత్వం వహించానని అన్నారు. ఇందుకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతలని అన్నారు.
Be first to comment on this News / Article!
|