సీక్రెట్ పెళ్లి ఖర్మేంటి?: నయన
గ్లామర్ తార నయనతార, డాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హైద్రాబాద్ లో సీక్రెట్ మ్యారేజ్ చేస్కున్నారంటూ మూడు రోజుల క్రితం జరిగిన ప్రచారం దావానలంగా మారి ఇటు టాలీవుడ్ నూ, అటు కోలీవుడ్ నూ ఓ ఊపు ఊపేసింది. ఇప్పటికే పలు తెలుగు, తమిళ చిత్రాలకు నయనతార కమిట్ కావడంతో నిర్మాతలు బెంబేలెత్తిపోయారు. ఇక నయతారను కలలరాణిగా భావించే కుర్రకారులో కలవరం మొదలైంది. నయనతార, ప్రభుదేవా కలిసి పనిచేస్తున్న 'విల్లు' చిత్రం షూటింగ్ లోనే ఈ ఇద్దరి మధ్యా ప్రేమ చిగురించనీ, నయనతార మలయాళంలో నటించిన 'బాడీగార్డ్' చిత్రంలో నయనతార నటించిన రెండు పాటలకు ప్రభుదేవా పైసా కూడా తీసుకోకుండా కొరియోగ్రఫీ అందించి ఆమెకు మరింత దగ్గరయ్యాడనీ ఆ వార్తా కథనాలు వెల్లడించాయి. దీనికితోడు ఇటీవల ప్రభు పేరును తన మణికట్టు పైభాగాన పచ్చబొట్టుగా పొడిపించుకోవడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్టయింది. హైద్రాబాద్ లో కొత్తగా ప్రారంభించిన టట్టూ లాంజ్ లో 'పి' అనే అక్షరం ఇంగ్లీషులోనూ, మిగిలిన అక్షరాలు తమిళంలో పచ్చబొట్టుగా నయన వేయించుకుంది. దీంతో ప్రభుదేవాపై తనకున్న ప్రేమను నయనతార చెప్పకనే చెప్పిందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 'వాళ్లిద్దరూ ప్రేమలో పడి ఉండొచ్చు. అయితే ఇద్దరూ వృత్తిపరంగా ప్రొఫెషనల్స్. కెరీర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందువల్ల ఇప్పడిప్పుడే వివాహం ఉండకపోవచ్చు' అని నయనతార సన్నిహితుల కథనం. 'పెళ్లి' వార్తలపై ప్రభుదేవా ఇంతవరకూ స్పందించనప్పటికీ నయనతార మాత్రం ఖండించడం విశేషం.
'మా పెళ్లి వదంతులు నా దృష్టికి కూడా వచ్చాయి. చాలా ఫన్నీగా ఉంది. అప్పడు నేనసలు హైద్రాబాద్ లోనే లేను. దాపరికం అనేది నాకు చేతకాదనే విషయం అందరికీ తెలుసు. నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే నిశ్చయంగా అందరికీ చెప్పే చేసుకుంటాను. వివాహ వ్యవస్థ పట్ల నాకెంతో మంచి అభిప్రాయం ఉంది. పెళ్లంటూ జరిగితే మా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకునే చేసుకుంటాను. రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు' అని నయనతార స్పష్టం చేసింది. ఆమె తాజా ప్రకటనతో నిర్మాతలు ఊపిరి పీల్చుకున్నట్టే. ప్రస్తుతం రవితేజ కథానాయకుడుగా నటిస్తున్న 'ఆంజనేయులు' చిత్రంలోనూ, ఎన్టీఆర్ కథానాయకుడుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అదుర్స్' లోనూ, మలయాళ 'బాడీగార్డ్ ' లోనూ నటిస్తోంది. ప్రభుదేవా సైతం సల్మాన్ ఖాన్, అయేషా టకియా జంటగా హిందీలో 'వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్' ('పోక్కిరి' రీమేక్) చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|