రాజమౌళికి సహాయనిరాకరణ?
సక్సెస్ మినహా ఫెయిల్యూర్స్ ఎరుగని ఎస్.ఎస్.రాజమౌళి మరోసారి జూలై 9న 'మగధీర' చిత్రంతో ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నారు. రామ్ చరణ్ కథానాయకుడు కావడం, 35 కోట్ల బడ్జెట్ తో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించడం సహజంగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్రం తర్వాత సునీల్ కథానాయకుడుగా రాజమౌళి కమిట్ అయిన కొత్త చిత్రం కూడా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇంత బిజీలో ఉన్న రాజమౌళిపై ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆప్ కామర్స్ 'సహాయ నిరాకరణకు' పిలుపునిచ్చిందని టాలీవుడ్ వర్గాల తాజా సమాచారం.
రాజమౌళికి సహకరించరాదంటూ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలకూ ఛాంబర్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఆ ప్రకారం చూస్తే ఇది రాజమౌళిపై అప్రకటిత బ్యాన్ గానే భావించాల్సి ఉంటుంది. ప్రముఖ నిర్మాత అడ్డాల చంటి ఫిర్యాదు మేరకే ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 2002లో రాజమౌళి తనకు సినిమా చేసిపెడతానంటూ 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ కు అంగీకరించారనీ, 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా కూడా తాను చెల్లించాననీ, అయితే రాజమౌళి ఇంతవరకూ తన మాట నిలబెట్టుకోలేదనీ అడ్డాల చంటి ఛాంబర్ కు ఫిర్యాదు చేశారట. తాను చెల్లించిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందిగా ఆయన ఛాంబర్ ను కోరారట. దీంతో ఏడాదికి 36 శాతం వడ్డీతో మొత్తం 25 లక్షలు చెల్సించాల్సిందిగా ఛాంబర్ రాజమౌళికి సూచించిందనీ, అందుకు ఆయన నిరాకరించారనీ తెలుస్తోంది. దీంతో
ఆరు నెలల పాటు ఆయనకు ఎలాంటి సహకారం అందించరాదంటూ పరిశ్రమకు చెందిన అన్ని విభాగాలనూ ఛాంబర్ కోరినట్టు సమాచారం. ఛాంబర్ నిర్ణయంపై రాజమౌళితో డైరెక్టర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందనీ, ఛాంబర్ నిర్ణయంపై కార్యాచరణకు సిద్ధమవుతున్నారనీ తెలుస్తోంది.
Be first to comment on this News / Article!
|