'వెంగమాంబ' ఆడియో
మీనా టైటిల్ పాత్రలో విజయభాస్కర్ దర్శకత్వంలో వి.దొరస్వామిరాజు నిర్మిస్తున్న 'వెంగమాంబ' చిత్రం ఆడియో ఆవిష్కరణ తిరుపతిలోని శ్వేత మందిరంలో ఆదివారంనాడు జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడు ఆడియో సీడీని విడుదల చేశారు. టిడిపి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మీనా, సాయికిరణ్, దొరస్వామిరాజు, చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, శ్వేత మందిరం డైరెక్టర్ భూమన, సాహితీవేత్త సాయికృష్ణ, ముదివర్తి కొండమాచార్యులు, గాయకుడు రామకృష్ణ, లహరి ఆడియో అధినేత మనోహర్ నాయుడు తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. లహరి మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
ఆదికేశవులునాయుడు మాట్లాడుతూ, శ్రీవారి భక్తురాలైన వెంగమాంబ గురించి అందరూ తెలుసుకునేందుకు వీలుగా తమిళ, కన్నడ భాషల్లోనూ దొరస్వామిరాజు నిర్మించాలని సూచించారు. అందుకు టీటీడీ సహకారాన్ని అందిస్తున్నారు. వెంకమాంబ భక్తురాలు మాత్రమే కాకుండా, ఆమెలో ఓ సంఘ సంస్కర్త కూడా ఉన్నారనీ, ఆ కోణాన్ని కూడా చిత్రంలో ఆవిష్కరించామని దర్శకుడు విజయభాస్కర్ తెలిపారు.
'అన్నమయ్య' తరహాలోనే ఈ చిత్రం కూడా అందరి మన్ననలు పొందుంతుందనే నమ్మకాన్ని దొరస్వామి రాజు వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో నటించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని మీనా పేర్కొన్నారు. నిర్మాత దొరస్వామిరాజు, వెంగమాంబ పాత్రధారి మీనా, సంగీత దర్శకుడు కీరవాణిని పలువురు అభినందించారు.
Be first to comment on this News / Article!
|