కరిష్మా కోఠక్ 'గ్లామర్'
బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కోఠక్ గుర్తుంది కదూ. మెగాస్టార్ చిరంజీవి 'శంకర్ దాదా జిందాబాద్'లో హీరోయిన్ గా కూడా నటించింది. ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కరిష్మా కోఠక్ ప్రధాన పాత్రలో 'గ్లామర్' పేరుతో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. గతంలో 'సర్దార్ చిన్నపరెడ్డి', 'ప్రత్యూష', 'అయ్యప్ప దీక్ష' వంటి పలు చిత్రాలను నిర్మించిన నటుడు, దర్శకనిర్మాత పి.సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈ కొత్త చిత్రం రూపొందనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సత్యారెడ్డి తెలిపారు.
సినిమా ప్రపంచమంటే గ్లామర్ రంగమనే పేరుందనీ, ఆ రంగంలోకి అడుగుపెట్టే యువతీ యువకులకు ఎదురయ్యే సంఘటనల సమాహారమే ఈ చిత్రమనీ ఆయన తెలిపారు. ఈనెల రెండో వారంలో అన్నపూర్ణా స్టూడియోస్ లో ఈ చిత్రం ప్రారంభమవుతుందన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని చెప్పారు. తొలి షెడ్యూల్ ను వైజాగ్, నాగార్జున సాగర్, కోనసీమ, శ్రీశైలం పరిసరాల్లో జరుపుతామనీ, జూలై మొదటి వారంలో స్విట్జర్లాండ్, మలేసియా, బ్యాంకాక్ లో జరిపే రెండో షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందన్నారు. ఇందులోని ఆరు పాటలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటాయన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో భవానీ అగర్వాల్, కవిత, భువనేశ్వరి, తెలంగాణ శకుంతల, బోంబే రవి, ఏవీయస్, రాంరెడ్డి, రఘునాథరెడ్డి తదితరులు నటించనున్నారు. కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే బాధ్యతలు సైతం పి.సత్యారెడ్డి చేపడుతుండగా, శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, బొంబాయి రవి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|