యువ ప్రేక్షకులను ఉర్రూతలూగించడంలో ప్రత్యేకమైన స్టయిల్ ఏర్పరచుకున్న చక్రి ఇటీవల కాలంలో సకెస్స్ ల పరంగా కొద్దిగా వెనుకబడ్డారు. ఓ సరైన మ్యూజికల్ హిట్ ఇస్తే మళ్లీ పూర్వవైభవం రావడం పెద్ద విషయం కాదు. తాజాగా చక్రికి ఓ ఎదురుదెబ్బ తగిలింది. జగపతిబాబు కథానాయకుడుగా అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో లాఫింగ్ లార్డ్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మిస్తున్న 'మా నాన్న చిరంజీవి' (పెద్ద హీరో) చిత్రం నుంచి చక్రికి ఉద్వాసన పలికారు. ఆయన పేరుతో పబ్లిసటీ డైజైన్స్ కూడా ఈ మధ్యనే రిలీజ్ చేశారు. అంతలోనే ఇప్పుడు ఆయన స్థానంలో సంగీత దర్శకుడు హేమచంద్ర వచ్చి చేశారు. గాయకుడైన హేమచంద్ర ఇటీవల 'రైడ్' చిత్రంలో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. చక్రిని తప్పించి హేమచంద్రకు 'మా నాన్న చిరంజీవి' బాధ్యతలు అప్పగించడానికి కారణాలు ఏమిటనేవి తెలియరాలేదు.
చక్రి చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉండటంతో ఈ సినిమా ఛాన్స్ కోల్పోయినా పెద్దగా వచ్చే నష్టం ఉండకపోవచ్చు. ఎటొచ్చీ ముందే తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి 'రీప్లేస్' వ్యవహారాలు పబ్లిసిటీకి నోచుకోవు. మరి చక్రి ఏమంటారో?!