సీడెడ్ రాజశేఖర్ సొంతం
డాక్టర్ రాజశేఖర్ అనగానే యాంగ్రీ యంగ్ మాన్ గా ఆయన నటించిన 'అంకుశం', 'ఆహుతి', 'ఆగ్రహం' వంటి సినిమాలే గుర్తుకు వస్తాయి. ఇటీవల 'ఎవడైతే నాకేంటి' తో ఇప్పటికీ తనలో ఫోర్స్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఆ వెనువెంటనే 'గోరింటాకు' వంటి సెంటిమెంట్ పాత్రలో నటించి మరో సక్సెస్ దక్కించుకున్నారు. తాజాగా 'నా స్టైలే వేరు' అంటూ ఈనెల 12న ప్రేక్షకుల తీర్పు కోరబోతున్నారు. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో మాగంటి గోపీనాథ్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రేక్షకులు ఆశించే నవరసాలు ఉంటాయని రాజశేఖర్ చెబుతున్నారు. ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో సీడెడ్ ఏరియాలో ఈ చిత్రాన్ని ఆయన సొంతంగా కూడా రిలీజ్ చేస్తున్నారు.
'ఇరవై ఐదేళ్ల కెర్ లో ఎన్నో పాత్రలు చేశాను. ఈ చిత్రంలో లాయర్ గా ఇంతవరకూ చేయనటువంటి పాత్ర చేశాను. తప్పనిసరిగా కొత్త రాజశేఖర్ ను చూస్తాను. ఇందులో పేరుకే నేను లాయర్ని. ఆ వృత్తికి దూరంగా ఉంటాను. అలాంటి పరిస్థితుల్లో సమస్యల్లో ఉన్న అమ్మాయి తారసపడుతుంది. అక్కడ్నించి ఆసక్తి కరమైన మలుపులు చోటుచేసుకుంటాయి. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్...ఇలా అన్ని ఎమోషన్లూ ఉంటాయి. ఏదీ శ్రుతిమించదు' అని రాజశేఖర్ తన పాత్ర గురించి వివరించారు. గతంలో తన పక్కన సరితూగే హీరోయిన్లు లేక కొన్ని సినిమాలు ఫెయిల్యూర్ అయ్యాయనీ, అందుకే ఈ సినిమాలో భూమికను ఎంపిక చేయడం చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్పారు. సినిమా అవుట్ పుట్ చూసి అంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. సినిమాపై ఉన్న నమ్మకంతో నిర్మాత మాగంటి గోపీనాథ్ ఆంధ్రాలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారనీ, తాను సైతం సీడెడ్ లో సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా సొంతంగా విడుదల చేస్తున్నాననీ చెప్పుకొచ్చారు. ఇటీవల వివిధ దర్శకులు చెప్పిన 30 కథలు విన్నాననీ, 10 రీమేక్ సినిమాలు చూశాననీ, వాటిలో నుంచి ఓ రీమేక్ తో పాటు మరో కథాచిత్రం చేయాలని అనుకుంటున్నానని తన తదుపరి ప్రాజెక్ట్ లను వివరించారు. అన్నట్టు మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'హలో' చిత్రానికి రీమేక్ గానే 'నా స్టైలే వేరు' తెరకెక్కింది.
Be first to comment on this News / Article!
|