కిడ్నాప్ లేదు..వరుడు కాదు!
మీడియా మందుకు రావడానికి అత్యుత్సాహం చూపని ప్రిన్స్ మహేష్ బాబు మళ్లీ రెండేళ్ల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అప్పుడెప్పుడే 'అతిథి' సినిమా తర్వాత ఇప్పుడే ఆయన మాట్లాడటం. ఈ రెండేళ్లలో మహేష్ సినిమా ఏదీ ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో పలు వదంతులు కూడా పుట్టుకొచ్చాయి. తాజాగా ఆయన తన సోదరి మంజులు తీసిన 'కావ్యాస్ డైరీ' నచ్చి ఆ విశేషాలతో ముందుకొచ్చారు. పనిలో పనిగా తనపై వచ్చిన వందతులకూ తెరదించారు.
'మంజులను స్క్రీన్ పై చూస్తే నాకు నవ్వొచ్చేది. కావ్యాస్ డీరీ సినిమాలో నాకు ఆమె ఆ అవకాశం ఇవ్వలేదు. ఎంతో అనుభవం ఉన్న నటిలా చేసింది. రెగ్యులర్ నటి కాకపోయినా మంజుల అభినందనీయమైన నటన కనబరచింది. టైటిల్ దగ్గర నుంచి దర్శకుడి టేకింగ్ వరకూ చాలా కొత్తగా సినిమా ఉంది. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కావ్యాస్ డైరీ వంటి చిత్రాలు రావడం పరిశ్రమకు శుభ పరిణామం. ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి' అంటూ మహేష్ ప్రశంసించారు. మహేష్ ను బాలీవుడ్ కు తీసుకువెళ్లాలనే పట్టదలతో నమ్రత ఆయనను ముంబైలో కొందరిచేత కిడ్నాప్ చేసిందనే పుకార్లు ఇటీవల బయటకు వచ్చాయి. దీనిపై మహేష్ స్పందిస్తూ 'ఈమధ్య నాపై చాలా రూమర్లే వచ్చాయి. నన్ను కిడ్నాప్ చేశారంటూ ఓ గాలి వార్త షికారు చేసింది. బాగా నవ్వుకున్నాను. మహేష్ సినిమాలు మానేసి యాడ్స్ చేసుకుంటున్నాండటూ మరికొందరు అంటున్నారు. యాడ్స్ వస్తున్నాయంటే స్టార్ గా నాకు పాపులారిటీ ఉన్నట్టే కదా' అంటూ నవ్వుతూ చెప్పారాయన. అంతా ప్రచారం చేస్తున్నట్టు తన తదుపరి చిత్రం పేరు 'వరుడు' కాదనీ, ఇంతవరకూ ఆ టైటిల్ అనుకోలేదనీ, రెండు మూడు నెలల్లో టైటిల్ ప్రకటిస్తామనీ చెప్పారు. త్రివిక్రమ్, తానూ కలిసి నటిస్తున్న చిత్రం మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుందన్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మంజుల నిర్మించనున్న చిత్రం జూలై ద్వితీయార్థంలో కానీ, ఆగస్టు ప్రథమార్థంలో కానీ ప్రారంభమవుతుందనీ, దీని తర్వాత మళ్లీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా ఉంటుందన్నారు. ఇక నుంచి ఏడాదికి రెండు సినిమాలు చేయడానికి కమిట్ అయినట్టు స్పష్టం చేశారు.
Be first to comment on this News / Article!
|