విక్టరీ వెంకటేష్ కు క్రికెట్ అంటే తగని ఇష్టం. కీలకమైన క్రికెట్ మ్యాచ్ లు ఇండియాలో ఎక్కడ జరిగినా ప్రత్యక్షంగా తిలకించే అవకాశం వచ్చినప్పుడు ఏమాత్రం తీరిక ఉన్నా వాటిని చేజార్చుకోరు. టాలీవుడ్ తరఫున స్టార్ క్రికెట్ పోటీలకు ఒకటి రెండు సార్లు ఆయన సారథ్యం కూడా వహించారు. షూటింగ్ షెడ్యూల్ లో బిజీ కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లకు హాజరుకాలేకపోయిన వెంకటేష్ ఇప్పుడు ఇంగ్లాండుకు పయనమవుతున్నారు. ఐసిసి టి-20 వరల్డ్ కప్ మ్యాచ్ లను వీక్షించి ఈనెలాఖరుకు ఆయన తిరిగి హైద్రాబాద్ చేరుకుంటారు.
వెంకటేష్ తో పాటు క్రికెట్ అంటే ఎంతగానో అభిమానించే ఆయన సోదరుడు డి.సురేష్ బాబు కూడా ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్తున్నారు. ఈ ట్రిప్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే వెంకటేష్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందనున్న 'నమో వెంకటేశ' చిత్రం ప్రారంభమవుతుంది. కమల్ హాసన్ తో కలిసి నటిస్తున్న'ఈనాడు' చిత్రంలో తన పోర్షన్ ను వెంకటేష్ ఇప్పటికే పూర్తి చేశారు. జూలైలో ఈ చిత్రం రిలీజ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.