'శంఖం' పూరిస్తున్న గోపీచంద్
'శౌర్యం' వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత గోపీచంద్, దర్శకుడు శివ కాంబనేషన్ లో శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'శంఖం' అనే టైటిల్ ను ఖరారు చేశారు. గోపీచంద్ కు జోడిగా త్రిష నటిస్తోంది. ఈ చిత్రం ఇంతవరకూ 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకొంటోంది.
నిర్మాత భగవాన్ ఆ విశేషాలను తెలియజేస్తూ, ఫిబ్రవరి 1న ప్రారంభమైన ఈ చిత్రం శరవేగంగా నిర్మాణం జరుపుకొంటోందని చెప్పారు. కథానుగుణంగా 'శంఖం' అనే టైటిల్ ఖరారు చేశామనీ, యూనిట్ సభ్యులందరికీ ఈ టైటిల్ బాగా నచ్చిందనీ తెలిపారు. ఇటీవల 'దిక్కు దిక్కు దిల్ బరసే...దిక్కులన్ని ఒక్కసారి రంగుబరసే' అంటూ భాస్కరభట్ల రాసిన ఓ పాటను హైద్రాబాద్ లోని వివిధ లొకేషన్లలో చిత్రీకరించామనీ, అలాగే ఇక్కడి ఓ హోటల్ లో కథకు కీలకమైన కొన్ని దృశ్యాలను తీశామనీ చెప్పారు. ఈనెల 6 నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుతున్నామనీ, 15 వరకూ ఈ షెడ్యూల్ ఉంటుందనీ అన్నారు. ఇదే నెల 19 నుంచి అస్ట్రేలియాలోని సుందర ప్రదేశమైన షిడ్నీలో రెండు పాటలు, కొన్ని దృశ్యాలు జూలై 10 వరకూ చిత్రీకరిస్తామని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిపే షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు పూర్తవుతుందని మరో నిర్మాత పుల్లారావు తెలిపారు. జూలై మూడోవారంలో ఓ ప్రముఖ ఆడియో కంపెనీ ద్వారా ఆడియో విడుదల చేస్తామనీ, ఆగస్టులో సినిమా రిలీజ్ ఉంటుందనీ చెప్పారు. హీరోగా ఈ చిత్రం తనకు మంచి పేరు తెస్తుందని గోపీచంద్ పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, ఆలీ, వేణుమాధవ్, కృష్ణ భగవాన్, ఎం.ఎస్.నారాయణ, ఎల్బీ శ్రీరామ్, శ్రీనివాసరెడ్డి, బెనర్జీ, సీత, రజిత తదితరులు నటిస్తున్నారు. అనిల్ రావిపూడి మాటలు, వెట్రి సినిమాటోగ్రఫీ, విజయ్-సెల్వ-గణేష్-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, తమన్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|