'కావ్యాస్ డైరీ'తో మంచి పేరు
'కావ్యాస్ డైరీ' చిత్రంలోని తన నటనకు అరుదైన ప్రశంసలు లభిస్తున్నాయనీ, ఇందులో నటించడం తనకెంతో సంతోషం కలిగించిందనీ ఆ చిత్ర కథానాయకుడు శశాంక్ పేర్కొన్నారు. మంజుల, ఛార్మి ముఖ్య భూమికలు పోషించిన 'కావ్యాస్ డైరీ' చిత్రాన్ని ఇందిరా క్రియేషన్స్ పతాకంపై మంజుల భర్త సంజయ్ స్వరూప్ నిర్మించారు. కరుణ ప్రకాష్ దర్శకత్వం వహించారు. ఈనెల 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకాదరణకు చేరువవుతున్న నేపథ్యంలో శశాంక్ హైద్రాబాద్ లో మంగళవారంనాడు ముచ్చటించారు.
'బంగారుబాబు' చిత్రంలో తన పాత్రకు ఇటీవల మంచి గుర్తింపు వచ్చిందనీ, ఇప్పుడు 'కావ్యాస్ డైరీ'లోని తన పాత్ర అంతకంటే ఎక్కువ పేరు తెచ్చిపెట్టిందనీ ఆయన చెప్పారు. ఈ చిత్రాన్ని చక్కటి టెక్నికల్ వాల్యూస్ తో తీశారనీ, క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందనీ పేర్కొన్నారు. సోలో హీరోగా చేస్తున్న తాను కథలోని పాత్రలను పట్టు చిన్న పాత్రలు చేయడానికి కూడా వెనుకాడనని అన్నారు. 'కావ్యాస్ డైరీ' అటువంటిదే అయినప్పటికీ మొదట్లో కొంచెం సంశయించాననీ, అయితే తన పాత్రను మంజుల చెప్పిన తీరు చాలా బాగా నచ్చి ఒప్పుకున్నాననీ అన్నారు. అలాగా పెద్ద బ్యానర్ లో చేయడం కూడా కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో చేశాననీ చెప్పారు. ప్రస్తుతం తాను గీతా కృష్ణ 'కాఫీబార్' లో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేస్తుండటం కూడా తన కెరీర్ కు బాగా ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తిగతంగా యాక్షన్ పాత్రలంటే ఇష్టమని చెప్పారు.
Be first to comment on this News / Article!
|