దేవనార్ పిల్లలతో బాలయ్య
యువరత్న నందమూరి బాలకృష్ణ నేటితో 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇందులో భాగంగా ఆయన హైద్రాబాద్ లోని దేవనార్ ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో అంధ విద్యార్థుల మధ్య బుధవారం ఉదయం తన బర్త్ డే వేడుకను ఉల్లాసంగా జరుపుకొన్నారు. కేక్ కట్ చేసి విద్యార్థుల నోటికి అందించడం ద్వారా ఆయన వారితో కొద్దిసేపు సరదాగా గడిపారు. విద్యార్థుల కోరిక మేరకు 'మంగమ్మ గారి మనవడు' చిత్రంలో తాను నటించిన హిట్ సాంగ్ 'దంచవే మేనత్త కూతురా...' పాటను పాడి వారిని ఆనంద పరచారు.
దేవనార్ పాఠశాలలోని విద్యార్థుల మధ్య తన బర్త్ డే జరగడం ఎంతో సంతోషంగా ఉందనీ, ఇక్కడ 300 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారనీ, ఉన్నత చదువులకు కూడా వాళ్లు వెళ్తున్నారనీ బాలకృష్ణ పేర్కొన్నారు. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న దేవనార్ పాఠశాల నిర్వాహకులను ఆయన అభినందించారు. కెరీర్ పరంగా బాలకృష్ణ ఈ ఏడాదితో 35వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలనటుడిగా 'తాతమ్మకల' (1974) చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'సాహసమే నా ఊపిరి' (1984) చిత్రంతో కథానాయకుడిగా మారిన బాలకృష్ణ అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. 'మంగమ్మగారి మనవడు', 'ఆదిత్య 369', 'భైరవ ద్వీపం', 'నరసింహనాయుడు', 'సమరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు. ఈ వేసవిలో 'మిత్రుడు'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఆయన తన 90వ సినిమాను 'భద్ర', 'తులసి' వంటి హిట్ చిత్రాలందించిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయబోతున్నారు. యునైటెడ్ మూవీస్ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మించనున్న ఈ చిత్రం ఆగస్టు 6న ప్రారంభం కానుంది. బాలకృష్ణ మరిన్ని విజయసోపానాలు అధిరోహించాలని బర్త్ డే సందర్భంగా అభిలషిద్దాం.
Be first to comment on this News / Article!
|