మాలాశ్రీ 'ఆంధ్ర కిరణ్ బేడి'
నటి మాలాశ్రీ కథానాయికగా కన్నడంలో రూపొందిన ఓ చిత్రాన్ని తెలుగులో 'ఆంధ్ర కిరణ్ బేడి' పేరుతో అనువదిస్తున్నారు. ఎన్.ఓంప్రకాష్ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని రాము ఎంటర్ ప్రైజెస్ పతాకంపై మాలాశ్రీ భర్త రాము తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారంనాడు ఆ విశేషాలను చిత్రయూనిట్ తెలియజేసింది.
మాలాస్రీ మాట్లాడుతూ, కన్నడంలో ఐదేళ్లు, తెలుగులో పదేళ్లు గ్యాప్ వచ్చిందనీ, గతంలో తాను 'ప్రేమఖైదీ', 'బావ బావమరిది' వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించానని అన్నారు. అప్పట్లో గ్లామర్, అల్లరి పాత్రల్లో కనిపిస్తే అందుకు భిన్నంగా ఈ చిత్రంలో యాక్షన్ కథానాయికగా నటించినట్టు చెప్పారు. కన్నడంలో ఈ చిత్రం విజయవంతమైందనీ, తెలుగులోనూ ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుందనే నమ్మకం తనకుందనీ అన్నారు. ఇదెంతమాత్రం కిరణ్ బేడి జీవిత ఇతివృత్తానికి సంబంధించిన చిత్రం కాదనీ, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించడం జరిగిందనీ వివరణ ఇచ్చారు. ఈ చిత్రం తెలుగులో బాగా ఆడితే ఓ స్ట్రయిట్ చిత్రం చేసే ఆలోచన కూడా తనకుందన్నారు. కన్నడంలో తాను హీరోయిన్ గా ఓ కొత్త చిత్రం జూలైలో ప్రారంభం కానుందని చెప్పారు. దర్శకుడు ఓం ప్రకాష్ రావు మాట్లాడుతూ, 25 రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్ ను హైద్రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియోస్ లో జరిపినట్టు తెలిపారు. నిర్మాత రాము మాట్లాడుతూ, తమ సంస్థ నిర్మించిన 25వ చిత్రమిదనీ, కర్ణాటకలో శతదినోత్సవానికి సినిమా పరుగులు తీస్తోందనీ చెప్పారు. ఈ బుధవారం నుంచే డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభించామని తెలిపారు. మాలాశ్రీ నటన, హంసలేఖ రీరికార్డింగ్ సినిమాకి ప్రధాన హైలైట్స్ అని రచయిత వెన్నెలకంటి పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో ఆశిష్ విద్యార్థి, జీవి, పి.డి.రాజు, మహేష్, తెలంగాణ శకుంతల తదితరులు ఈ చిత్రంలో నటించారు. వెన్నెలకంటి రచన, విష్ణువర్దన్ సినిమాటోగ్రఫీ, పళనిరాజ్ ఫైట్స్, హంసలేఖ సంగీతం అందించారు.
Be first to comment on this News / Article!
|