మనోజ్-వీరూ చిత్రం ప్రారంభం
మంచు మనోజ్ కుమార్, షీనా హీరోహీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఏ.కే.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సుంకర రామబ్రహ్మం తీస్తున్న కొత్త చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని రామానాయుడు సినీ విలేజ్ లో బుధవారం ఉదయం జరిగింది. ప్రముఖ రచయిత వీరు పోట్ల ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మనోజ్ కుమార్ పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ ఇవ్వగా, కె.రాఘువేంద్రరావు కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నటుడు డాక్టర్ ఎం.మోహన్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు వీరుపోట్ల మాట్లాడుతూ, రచయితగా అందరికీ తెలిసిన తాను తొలిసారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నానని చెప్పారు. ఇది యూత్ యాక్షన్ తో మిళితమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పారు. మనోజ్ నిజజీవితానికి దగ్గరగా ఆయన పాత్ర ఉంటుందనీ, ప్రతి పాత్రను హోం వర్క్ చేసి మరీ నటించే మనోజ్ దర్శకుల హీరో అనీ అన్నారు ఈనెల 11 నుంచి 21 వరకూ తొలి షెడ్యూల్, జూన్ 3 నుంచి అక్టోబర్ నెలాఖరు వరకూ రెండో షెడ్యూల్ ఉంటుందని తెలిపారు. మనోజ్ మాట్లాడుతూ, కెరీర్ పరంగా తాను ఫెయిల్యూర్స్ లో ఉన్నప్పుడు ఈ చిత్ర నిర్మాత తనతో సినిమా తీయాలని అనుకున్నారనీ, అలాగే వీరుపోట్లతో ఇంతకుముందే తాను సినిమా చేయాల్సి ఉందనీ చెప్పారు. ఇటీవల విడుదలైన 'ప్రయాణం' చిత్రం కంటే ఈ చిత్రం మరింత మరింత పెద్ద సక్సెస్ సాధిస్తుందనే నమ్మకం తనకుందని అన్నారు. వీరూ పోట్ల తన వద్ద దర్శకత్వ శాఖలో చేశారనీ, దర్శకుడిగా కూడా సక్సెస్ అవుతారనే నమ్మకం తనకుందనీ పరుచూరి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఇందులో హీరోయిన్ తండ్రిగా నటిస్తున్నట్టు కాశీ విశ్వనాథ్ తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో విజయ్ కుమార్, బ్రహ్మానందం, పరుచూరి వెంకటేశ్వరరావు, జయప్రకాష్ రెడ్డి, ఆహుతి ప్రసాద్, సునీల్, ఎమ్మెస్ నారాయణ, మాస్టర్ భరత్, జీవా, సుబ్బరాజు, సంగీత, రజిత, తెలంగాణ శకుంతల తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి భువనచంద్ర పాటలు, వీరూ పోట్ల మాటలు, రమేష్ బాబు సినిమాటోగ్రఫీ, రామ్-లక్ష్మణ్ ఫైట్స్, మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్, బొబో శశి సంగీతం అందిస్తున్నారు.

Be first to comment on this News / Article!
|