సలోనికి అండగా రాజమౌళి
రాజమౌళి దర్శకత్వంలో నటించిన హీరోలకే కాదు, హీరోయిన్లకు కూడా మంచి బ్రేక్ వస్తుంటుంది. ఆయన సినిమాల్లో అవకాశమొస్తే ఎగిరి గంతేయని హీరోయిన్లు ఉండరేమో. అలాంటి అదృష్టమే ఇప్పుడు గ్లామర్ బ్యూటీ సలోనికి దక్కింది. సలోని పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదూ. నిజమే. సిద్దార్ధతో 'చుక్కల్లో చంద్రుడు', తరుణ్ తో 'ఒక ఊరిలో', రాజాతో 'కోకిల', సుమంత్ తో 'ధన 51' వంటి పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ ఆమె నటించిన ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ హిట్ కు నోచుకోలేదు. దీంతో ఆమెకు వేషాలు కరువయ్యాయి. ఈ గ్యాప్ లో కన్నడంలో ఉపేంద్ర వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తూ ఇప్పుడు మరోసారి తెలుగులో రీఎంట్రీ అవుతోంది. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ కథానాయకుడుగా ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన 'మర్యాద రామన్న' చిత్రంలో సలోని హీరోయిన్ గా నటిస్తోంది.
రాజమౌళి దర్శకత్వంలో అవకాశం రావడం పట్ల సలోని ఉబ్బితబ్బిబ్బవుతోంది. గతంలో తాను తెలుగులో మంచిపేరే తెచ్చుకున్నా సరైన హిట్ దొరకలేదనీ, 'మర్యాద రామన్న'తో తనకు మంచి బ్రేక్ వస్తుందనే నమ్మకంతో ఉన్నాననీ సలోని చెబుతోంది. రాజమౌళి సినిమాలో అవకాశం దక్కిన వైనం వివరిస్తూ, రామ్ చరణ్ కథానాయకుడుగా రాజమౌళి దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న 'మగధీర' చిత్రంలో తాను ఓ ఐటెం సాంగ్ చేశాననీ, ఆ తదుపరి చిత్రానికే రాజమౌళి హీరోయిన్ గా తనకు అవకాశం ఇవ్వడం మరిచిపోలోననీ ఆయన పట్ల తన కృతజ్ఞత తెలియజేసింది. రాజమౌళి అండతోనైనా సలోనికి ఓ సరైన హిట్ వస్తే మంచిదే...
Be first to comment on this News / Article!
|