కరిష్మా 'గ్లామర్' ప్రారంభం
కరిష్మా కోఠక్ ('శంకర్ దాదా జిందాబాద్' ఫేమ్) ప్రధాన పాత్రలో జనం ఎంటర్ టైన్స్ మెంట్స్ పతాకంపై తెలుగు., తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్న చిత్రం 'గ్లామర్'. గతంలో 'సర్దార్ చిన్నపరెడ్డి', 'ప్రత్యూష' వంటి దాదాపు 15 చిత్రాలు నిర్మించిన నటుడు, దర్శకనిర్మాత పి.సత్యారెడ్డి ఈ కొత్త చిత్రాన్ని స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. అన్నపూర్ణా స్టూడియోస్ లో గురువారంనాడు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కరిష్మా కోఠక్, భవాని అగర్వాల్, పి.సత్యారెడ్డిపై 'కళామతల్లి కన్నతల్లివంటిది' అనే డైలాగ్ ముహూర్తం షాట్ గా తీశారు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మద్ మహ్మద్ అహ్మదుల్లా క్లాప్ కొట్టగా, పారిశ్రామిక వేత్త వై.వి.సుబ్బారెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించారు. బి.వి.రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి ఆశీర్వచనాలు పలికారు.
సత్యారెడ్డి మాట్లాడుతూ, గ్లామర్ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టే యువతీ యువకులకు ఎదురయ్యే సంఘటన ఆధారంగా అత్యంత గ్లామర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని చెప్పారు. వైజాగ్, ఎత్తిపోతల, నాగార్జున సాగర్, కోనసీమ, శ్రీశైలం ఏరియాలలో తొలి షెడ్యూల్ ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామనీ, రెండో షెడ్యూల్ ఆగస్టు మొదటివారంలో సింగపూర్, మలేసియా, బ్యాంకాక్ లలో పూర్తి చేస్తామనీ తెలిపారు. ఇందులోని 6 పాటలు ఉంటాయన్నారు. కరిష్మా కోఠక్ మాట్లాడుతూ, 'శంకర్ దాదా జిందాబాద్' తర్వాత ఎన్ని ఆఫర్లు వచ్చినా చేయలేదనీ, ఈ సినిమా కథ నచ్చడంతో అంగీకరించాననీ చెప్పింది. మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసిందనీ, తనకు తమ్ముడులాంటి సత్యారెడ్డి నిర్మిస్తున్న 'గ్లామర్' చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాననీ అన్నారు. గుంటూరు ఎమ్మెల్యే ఎస్.కె.మస్తాన్ వలీ, మాచర్ల ఎమ్మెల్యే పి.రామకృష్ణారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే జి.ప్రశాంత్ రెడ్డి, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎల్.అప్పిరెడ్డి, ఎపిఐసిసి మాచీ చైర్మన్ అంబటి రాంబాబు, డి.కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కవిత, భువనేశ్వరి, తెలంగాణ శకుంతల, బోంబే రవి, ఏవీయస్ తదితరులతో పాటు ఓ ప్రముఖ నటుడు కూడా నటించనున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు-స్క్రీన్ ప్లే సైతం పి.సత్యారెడ్డి అందిస్తుండగా, శ్రీనివాస్ సినిమాటోగ్రఫీ, బోంబె రవి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|