నితిన్ చిత్రానికి వైఎస్ క్లాప్
నితిన్, హన్సిక జంటగా వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై కొత్త చిత్రం గురువారంనాడు ప్రారంభమైంది. 'సిద్ధు ఫ్రమ్ సికాకుళం' వంటి హిట్ చిత్రాన్ని అందించిన విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే డాక్టర్ విజయప్రసాద్ మళ్ల తమ సంస్థ ద్వితీయ చిత్రంగా ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. హైద్రాబాద్ లోని సిఎం క్యాంప్ ఆఫీస్ లో ఈ చిత్రం ప్రారంభమైంది. నితిన్ పై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.బాలరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రి గీతారెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
డాక్టర్ విజయప్రసాద్ మళ్ల మాట్లాడుతూ, వై.ఎస్. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేతులమీదుగా ప్రారంభమైన తొలి సినిమా ఇదేనని అన్నారు. తమ సంస్థ తొలి చిత్రం శతదినోత్సవం జరుపుకొందనీ, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు అంతకంటే మంచి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. ఈనెల 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ పరిసరాల్లో జరుగుతుందని చెప్పారు. నాలుగు షెడ్యూల్స్ లో సినిమా పూర్తవుతుందనీ, అక్టోబర్ లో విదేశాల్లో పాటల చిత్రీకరణ జరుపుతామని చెప్పారు. తన కెరీర్ కు కీలకమైన ఈ చిత్రానికి ముఖ్యమంత్రి వై.ఎస్. క్లాప్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని నితిన్ పేర్కొన్నారు. 'సిద్ధూ ఫ్రమ్...'కంటే ఈ చిత్రాన్ని మరింత పెద్ద సక్సెస్ చేసేందుకు శక్తివంచన లేకుండా కష్టపడతానని దర్శకుడు ఈశ్వర్ అన్నారు. అంతముకుందు హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరిగాయి. వెల్ఫేర్ గ్రూప్ నకు చెందిన మళ్ల అరుణకుమారి, కె.ఎస్.రామారావు, సి.కల్యాణ్, సంగీత దర్శకుడు అనూప్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించనున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|