ప్రభాస్ కొత్తచిత్రం షురూ
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు కరుణాకరన్ కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రంలో కాజల్ కథానాయిక. ప్రభాస్ తో గతంలో 'ఛత్రపతి' వంటి సెన్సేషన్ హిట్ ను అందించిన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ ఈ తాజా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రూపొందుతున్న ఈ కొత్త చిత్రం షూటింగ్ హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో శుక్రవారంనాడు ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి కరుణాకరన్ తండ్రి అళగర్ స్వామి క్లాప్ ఇవ్వగా, హీరో ప్రభాస్ దర్శకత్వం వహించారు.
ప్రభాస్ తో తమ బ్యానర్ లో తీస్తున్న రెండో చిత్రమిదనీ, కరుణాకరన్ చాలా మంచి కథ ఇచ్చారని బివిఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందన్నారు. ప్రభాస్ మాట్లాడుతూ, కరుణాకరన్ చెప్పిన కథ చాలా ఆసక్తికరంగా ఉందనీ, ప్రేమకథల్లో వైవిధ్యమైన కోణం ఇందులో ఉందనీ అన్నారు. జూలై మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందనీ, నిరవధికంగా జరిగే సింగల్ షెడ్యుల్ తో ఈ చిత్రం పూర్తవుతుందనీ చెప్పారు. కరుణాకరన్ మాట్లాడుతూ, గతంలో పలు ప్రేమకథా చిత్రాలు వచ్చినప్పటికీ, ఇది ట్రెండ్ సెట్టర్ అవుతుందన్నారు. ప్రేక్షకులకు తమ జీవితంలో జరిగే సంఘటనలను గుర్తుతెచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ప్రభాస్ కు తగినట్టు యాక్షన్ మిళితం చేసిన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుందని చెప్పారు. ఈ చిత్రంలో తమిళ నటుడు ప్రభు ఓ ముఖ్య పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి ఆండ్రూస్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్స్ ఫైట్స్, జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|