'వ్యాపారి' పాటలు
'ఖుషి', 'కొమురం పులి' చిత్రాల దర్శకుడు ఎస్.జె.సూర్య ద్విపాత్రాభినయంలో నమిత, మాళవిక ప్రధాన పాత్రల్లో తమిళంలో విజయవంతమైన 'వ్యాబారి' చిత్రం తెలుగులో 'వ్యాపారి' పేరుతో అనువాదమై విడుదలకు సిద్ధమవుతోంది. శక్తి చిందబరం దర్శకుడు. నూకారపు సూర్యప్రకాశరావు ఆశీస్సులతో ప్రణతి క్రియేషన్స్ బ్యానర్ పై కూనిరెడ్డి శ్రీనివాస్ తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించారు. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఆడియో వేడుక జరిగింది. ఆడియో క్యాసెట్ ను నూకారపు సూర్యప్రకాశరావు ఆవిష్కరించగా, పాటల సీడీని ఆర్.పి.పట్నాయక్ ఆవిష్కరించారు. లక్ష్మీకాంత్ చెన్నా, నిధిప్రసాద్, శ్రీనివాసరెడ్డి, సూర్యకిరణ్, బి.జయ, డిఎస్ రాజు, భారతీబాబు, నిహాల్, రమ్యశ్రీ, తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య మ్యజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
నూకారపు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తమ సంస్థ నుంచి పుట్టుకొచ్చిందే ఈ ప్రణతి క్రియేషన్స్ అనీ, సోదర సమానుడైన కూనిరెడ్డి శ్రీనివాస్ తొలి ప్రయత్నంగా చేపట్టిన 'వ్యాపారి' చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. కూనిరెడ్డి శ్రీనివాస్ మంచి విద్యావేత్త, వ్యాపారీ అనీ, ఇక నుంచి మంచి సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్నాననీ బి.జయ పేర్కొన్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్నిక్వాలిటీ బాగుండాలనే ఉద్దేశంతో 20 రోజులు డబ్బింగ్ చేశామనీ, పాటలన్నీ బాగా వచ్చాయనీ రచయిత భారతీబాబు తెలిపారు. తన మిత్రుడు, ఫిలాసఫర్, గైడ్ అయిన సూర్యప్రకాశ్ రావు నిర్మించిన 6 విజయవంతమైన చిత్రాలకు తాను ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాననీ, ఆ స్ఫూర్తితో ఇప్పుడు 'వ్యాపారి' చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నానని కూనిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. క్లోనింగ్ అనే అంశం చుట్టూ ఈ చిత్ర కథ ఎంతో ఆసక్తి కరంగా ఉంటుందనీ, త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు.
Be first to comment on this News / Article!
|