అర్చన `సివంగి' ప్రారంభం
హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కొన్ని విజయవంతం కావడంతో ఈ తరహా సినిమాలను తీసేందుకు దర్శక, నిర్మాతలు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అనేక చిత్రాల ద్వారా సుపరిచతమైన అర్చన (వేద) ద్విపాత్రాభినయంతో తాజాగా సివంగి చిత్రం రూపుదిద్దుకుంటోంది. తెలుగు క్రియేషన్స్ పతాకంపై కృష్ణ తోట దర్శకత్వంలో వి.ఆర్.బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో జరిగింది. థ్రిల్లర్ మంజు, అర్చనలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు క్లాప్ నివ్వగా, మరో నిర్మాత ఎన్.వి.సుబ్బరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకుడు పి.సి.రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు కృష్ణ తోట మాట్లాడుతూ ఇంతవరకు తొమ్మిది సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. ఈ చిత్రానికి ముందు తీసిన సందేశాత్మక చిత్రం మహాయజ్ఞం వృత్తిపరంగా నాకెంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఈ చిత్రం రొమాంటిక్ యాక్షన్ లేడీ ఓరియెంటెడ్ చిత్రమైనా అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయన్నారు. సబ్జెక్టు బాగా రావడం కోసం స్క్రిప్టు రూపకల్పనలో ఎక్కువ సమయాన్ని కేటాయించినట్లు వివరించారు.
కథానాయిక అర్చన మాట్లాడుతూ ఈ చిత్ర కథన తనకెంతో బాగా నచ్చిందన్నారు. నటించేందుకు మంచి అవకాశమున్న చిత్రమనీ, ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నానని తెలిపారు. సివంగి టైటిల్ కు ట్యాగ్ లైన్ గా ఎవరి మాట వినదు అని నిర్ణయించారని, అదేమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు. సివంగిలో తనకు ఫైట్ సీక్వెన్సీలు ఉన్నాయని, వాటిలో పాల్గొనేందుకు తానెంతో ఆసక్తిగా ఉన్నట్లు ఆమె తెలిపారు. థ్రిల్లర్ మంజు మాట్లాడుతూ చాలాకాలం తర్వాత తెలుగులో సినిమా చేస్తున్నాని, ఈ చిత్రంలో మంచి పాత్రను పోషించడంతో పాటు ఫైట్ మాస్టర్ గా కూడా పనిచేస్తున్నానని చెప్పారు. నిర్మాత వి.ఆర్.బాబు మాట్లాడుతూ పలువురు సీనియర్ నటీనటులు తమ చిత్రంలో నటిస్తున్నారని, దాదాపు 40 రోజుల పాటు సింగిల్ షెడ్యూల్స్ లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. బ్యాంకాక్ లో కొంత చిత్ర షూటింగ్ తో పాటు పాటలు తీస్తున్నట్లు ఆయన తెలిపారు. సహనిర్మాత జి.రవికుమార్ మాట్లాడుతూ ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రమవుతుందన్నారు. ఈచిత్రంలో నాజర్, భానుప్రియ, తెలంగాణ శకుంతల, సత్యప్రకాష్, సుమన్ శెట్టి, కొండవలస, కృష్ణభగవాన్, రామిరెడ్డి, సంగీత, కళ్ళు చిదంబరం తదితరులు తారాగణం. పాటలు సుద్దాల అశోక్ తేజ, గోరటి వెంకన్న, నిర్మాత వి.ఆర్.బాబు, కథ స్క్రీన్ ప్లే, దర్శకత్వం కృష్ణతోట, వందేమాతరం సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|