రూ.999 మాత్రమే
నలుగురు కుర్రాళ్ల చుట్టూ తిరిగే కథాంశంతో 'రూ.999 మాత్రమే' చిత్రం రూపొందింది. కౌటిల్య, ప్రభాకర్, మధు, అనిల్, ప్రవీణ్ బాబు ప్రధాన పాత్రధారులు. నెవర్ 9 క్రియేటర్స్ బ్యానర్ పై గోవింద్ నవీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు-రాగాలు, దర్శకత్వ బాధ్యతలను పర్స మహేందర్ చేపట్టారు. తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమతి సారథ్యంలో ఈనెల 27న ఈ చిత్రం విడుదలవుతోంది. హైద్రాబాద్ లో బుధవారంనాడు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకనిర్మాతలు ఈ చిత్ర విశేషాలను తెలియజేశారు.
చిన్న చిన్న కారణాల వల్ల విడుదల నోచుకుకుండా ఆగిపోయిన సినిమాలను తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి విడుదల చేసేందుకు సంకల్పించిందనీ, ఈ క్రమంలోనే 'రూ.999 మాత్రమే' చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోందనీ ప్రముఖ దర్శకనిర్మాత వి.సాగర్ తెలిపారు. చదలవాడ శ్రీనివాసరావు చైర్మన్ గా అనుభవం కలిగిన నిర్మాతలతో ఈ సమితి ఏర్పడిందనీ, చిన్న సినిమా నిర్మాతలకు ఉపయోగకరంగా అనేక మంచి నిర్ణయాలతో సమితి ముందుకు సాగడం అభినందనీయమనీ ఆయన అన్నారు. చిత్ర నిర్మాత గోవింద్ నవీన్ మాట్లాడుతూ, నిర్మాతగా తనకు ఇది తొలి చిత్రమనీ, తొలికాపీ వచ్చిన తర్వాత ఎలా విడుదల చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో సమితి ఆదుకుందని చెప్పారు. చాలా మంచి చిత్రమిదనీ, పలువురు సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో నటించారని తెలిపారు. ఇదొక విభిన్న కథా చిత్రమని పర్స మహేందర్ తెలిపారు. చదువుకు ప్రోత్సహించే ప్రభుత్వం ఆ తర్వాత ఏం చేస్తోందన్న అంశాన్ని ఈ చిత్రంలో ఆవిష్కరించామన్నారు. ఇందులో ఓ ప్రముఖ హీరో కూడా నటించారనీ, అయితే ఆయన ఎవరన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేననీ అన్నారు. బహ్మానందం, కృష్ణ భగావాన్, జయప్రకాష్ రెడ్డి చక్కటి హాస్యంతో ప్రేక్షకులను అలరించనున్నారని చెప్పారు. ఇందులోని నలుగురు కుర్రాళ్లలో తాను కూడా ఓ పాత్ర పోషించినట్టు నటుడు ప్రభాకర్ చెపపారు. ఫోటోగ్రఫీకి మంచి స్కోప్ ఉన్న చిత్రమిదని ఛాయాగ్రాహకుడు ఆర్.వి.ఎస్.కోటి తెలిపారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో క్రిష్, శివకృష్ణ, నర్సింగ్ యాదవ్, చిత్రం శ్రీను, హేమ, జయలలిత తదితరులు నటించారు.
Be first to comment on this News / Article!
|