'భీష్మ'గా బాలకృష్ణ
పేరున్న హీరోల్లో చాలామంది ఏడాదికి ఒక్క చిత్రానికే పరిమితమవుతున్న తరుణంలో బాలకృష్ణ వరుస చిత్రాలతో స్ప్రింట్ కొట్టబోతున్నారు. 'మిత్రుడు' చిత్రం తర్వాత యునైటెడ్ మూవీస్ బ్యానర్ పై పరుచూరి కిరీటి నిర్మించనున్న చిత్రానికి బాలకృష్ణ ఇప్పటికే కమిట్ అయ్యారు. బోయపాటి శ్రీను ('భద్ర', 'తులసి' ఫేమ్) దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం ఆగస్టు మొదటివారంలో ప్రారంభం కానుంది. ఆసక్తికరంగా ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న తదుపరి చిత్రానికి కూడా బాలకృష్ణ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 'లక్ష్మీనరసింహా' చిత్రం గతంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ మంచి మిత్రులుగా అందరికీ తెలుసు. కొద్దికాలం క్రితం బాలకృష్ణ ఇంట్లో కాల్పుల వ్యవహారం తర్వాత ఇద్దరి మధ్యా కొంత గ్యాప్ వచ్చింది. అయితే ఇటీవల కాలంలో మళ్లీ ఈ ఇద్దరూ ఒకటయ్యారు. బెల్లంకొండ తాజా చిత్రమైన 'రైడ్' ఆడియో ఫంక్షన్ కు బాలకృష్ణ విచ్చేశారు. బాలకృష్ణ డేట్స్ ఇస్తే వెంటనే ఆయనతో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు బెల్లంకొండ ఆ సందర్భంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన బాలకృష్ణ బర్త్ డే ఫంక్షన్ లోనూ బెల్లంకొండతో పాటు, 'రైడ్' చిత్రం యూనిట్ కూడా పాల్గొంది. 'రైడ్' చిత్రానికి దర్శకత్వం వహించిన రమేష్ వర్మ చెప్పిన ఓ స్టోరీలైన్ బాలకృష్ణకు నచ్చడంతో అదే కథతో బాలయ్య కథానాయకుడిగా బెల్లంకొండ ఇప్పుడు ఓ కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. దీనికి 'భీష్మ' అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈనెల 29న ఈ కొత్త చిత్రం లాంఛనంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అన్నట్టు..నటరత్న ఎన్టీఆర్ అప్పట్లో నటించిన పౌరాణిక చిత్రం 'భీష్మ' సంచలన విజయం సాధించింది. అయితే బాలయ్య 'భీష్మ' మాత్రం సాంఘిక చిత్రంగా తెరకెక్కనుంది.
Be first to comment on this News / Article!
|