రామ్ 'రామ రామ కృష్ణ కృష్ణ'
'దేవదాసు', 'రెడీ' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలందించిన రామ్ కథానాయకుడుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీవాస్ ('లక్ష్యం' ఫేమ్) దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న 'రామ రామ...కృష్ణ కృష్ణ' చిత్రం పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో గురువారం ఉదయం జరిగాయి. రామ్ కు జోడిగా ప్రియ హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసి యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.
దిల్ రాజు మాట్లాడుతూ, తమ సంస్థ నిర్మిస్తున్న పదవ చిత్రమిదనీ, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ఉంటుందనీ చెప్పారు. గతంలో తమ సంస్థ మంచి కథ, కథనాలతో చక్కటి సాంకేతిక విలువలతో రూపొందించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారనీ, వాటికంటే మిన్నగా మంచి సబ్జెక్ట్ తో ఈ చిత్రం రూపొందనుందనీ తెలిపారు. జూలై 9 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందనీ, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామనీ చెప్పారు. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలుగా వ్యవహరించనున్న ఈ చిత్రానికి ఎం.రత్నం మాటలు, శేఖర్ వి జోసఫ్ సినిమాటోగ్రఫీ, ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించనున్నారు.
Be first to comment on this News / Article!
|