సిద్ధార్ధతో రాఘవేంద్రరావు చిత్రం
సిద్దార్ధ హీరోగా అబోడ్ పతాకంపై దర్శకేంద్రుడు కె.రాఘువేంద్రరావు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. గతంలో 'నీతో' చిత్రంతో హీరోగా పరిచయమైన రాఘువేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రకాష్ ఇటీవల దర్శకత్వం వహించిన 'బెల్లీఫుల్ ఆఫ్ డ్రీమ్స్' చిత్రానికి జాతీయ అవార్డు కూడా లభించింది. తాజా చిత్ర విశేషాలను హైద్రాబాద్ లోని సినిమాక్స్ లో గురువారంనాడు చిత్రయూనిట్ తెలియజేసింది.
దర్శకుడు ప్రకాష్ మాట్లాడుతూ, నాన్నగారు తీసిన 'అన్నమయ్య', 'జగదేకవీరుడు అతిలోకసుందరి' చిత్రాలంటే తనకెంతో ఇష్టమనీ, ఈ సినిమా కూడా ఆ రెండింటి కోవలో ఉంటుందనీ చెప్పారు. ఫాంటసీ, కమర్షియల్ అంశాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు చెప్పారు. ఇందులోని పాత్రకు సిద్దార్ధ చక్కగా సరిపోతాడనీ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నామనీ చెప్పారు. ఆగస్టు మొదటివారంలో షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. హీరో సిద్దార్ధ మాట్లాడుతూ, కె.రాఘువేంద్రరావు దర్శకత్వంలో పనిచేయాలన్న తన కోరిక ఈ రకంగా తీరుతోందని అన్నారు. రాఘవేంద్రరావు, రాజమౌళి, క్రిష్ లో ఉన్న క్వాలిటీస్ అన్నీ ప్రకాష్ లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది కెరీర్ పరంగా తనకు చాలా బాగుందనీ, 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' హిట్ కాగా, 'ఓయ్' ఆడియో మంచి సక్సెస్ అయిందనీ, మళ్లీ ఇదే ఏడాది ఈ ప్రాజెక్ట్ వచ్చిందనీ అన్నారు. ప్రకాష్, తానూ కలిసి ఒక సినిమా చేయాలనుకున్నప్పటికీ అది కార్యరూపంలోకి రాలేదని రాజమౌళి పేర్కొన్నారు. ప్రకాష్ తన తండ్రి కంటే మంచి మాస్ దర్శకుడవుతారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఫాంటసీతో కూడిన ఈ స్క్రిప్టు తనకు బాగా నచ్చిందని క్రిష్ అన్నారు. ఈ కార్యక్రమంలో కె.రాఘువేంద్రరావు కూడా పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|