రవితేజ జంటగా లక్ష్మీరాయ్
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్.థోని గర్ల్ ఫ్రెండ్ గా పాపులర్ అయిన నటి లక్ష్మీరాయ్ మరోసారి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కొద్దికాలం క్రితం శ్రీకాంత్ సరసన 'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రంలో లక్ష్మీరాయ్ నటించింది. ఆ చిత్రం ఫెయిల్ కావడంతో లక్ష్మీరాయ్ తమిళంలో అడుగుపెట్టి ఓ రెండు మూడు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో ఆమె బిజీగా ఉంది. తాజాగా రవితేజ కథానాయకుడుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా లక్ష్మీరాయ్ ను ఎంపిక చేసినట్టు తెలిసింది. 'సింధూరం', 'ఖడ్గం' చిత్రాల తర్వాత రవితేజ-కృష్ణవంశీ కాంబినేషన్ ను కలుపుతూ శ్రీ సాయి గణేష్ పతాకంపై బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది. దీనికి 'ఫైట్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
కృష్ణవంశీ ప్రస్తుతం శ్రీకాంత్ 100వ చిత్రం 'మహాత్మ'కు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ నటుడు గణేష్ బాబు నిర్మాతగా పరశురామ్ ('యువత' ఫేమ్) దర్శకత్వం వహిస్తున్న 'ఆంజనేయులు' చిత్రంలో నటిస్తున్నారు. లక్ష్మీరాయ్ తమిళంలో 'వామనన్', 'ముతిరై', 'నాన్ అవనిలై', 'ఇరంబు కొట్టై మురత్తు సింగం', మలయాళంలో 'కాసనోవా', హిందీలో 'హే గుజ్జు' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Be first to comment on this News / Article!
|