మొదలైన 'యుగళగీతం'
టీనేజ్ అనేది యువతీయువకులకు కీలకం. మంచి మార్గంలో పయనించినా, చెడు అలవాట్లకు గురైనా టీనేజ్ లోనే అది మొదలవుతుందని అంటారు. అందుకే టీనేజ్ లో ఆవేశం కంటే ఆలోచనతో ముందడుగు వేయాలని చెబుతారు. టీనేజ్ లో తప్పుదారి పట్టిన విద్యార్థులు, క్రమశిక్షణలో మెలిగే విద్యార్థుల జీవితాలకూ మధ్య తారతమ్యాన్ని చూపిస్తూ 'యుగళగీతం' అనే చిత్రం రూపొందుతోంది. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దివ్య ఆశీస్సులతో జీవిఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై శ్రీమతి కవిత ఇంజేటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివాజీ దర్శకుడు. శ్రీకర్, అభిషేక్, చందు, శివ ముప్పాళ్ల, సోని చరిష్ట, సబ్రినాహష్మి, లక్ష్మీచంద్రిక, అనూష ప్రధాన తారాగణం. ఈ చిత్రం షూటింగ్ మియాపూర్ లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి కవిత ఇంజేటి క్లాప్ ఇవ్వగా, గురవయ్య స్వామి కెమెరా స్విచ్చాన్ చేశారు.
కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు శివాజీ తెలిపారు. చదువుకునే రోజుల్లో చదువే ముఖ్యం కావాలనే సందేశం ఈ చిత్రంలో ఇవ్వబోతున్నామని తెలిపారు. 25 రోజుల పాటు జరిపే నాన్ స్టాప్ షెడ్యూల్ తో టాకీ పూర్తవుతుందనీ, జూలైలో పాటల చిత్రీకరణ జరుపుతామని చెప్పారు. మాటల రచయిత మరుధూరి రాజా మాట్లాడుతూ, యువతనే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఇందులోని 5 పాటల్లో రెండు మెలోడీ ప్రధానంగానూ, ఒకటి ఫాస్ట్ బీట్ తోనూ ఉంటుందని సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ వివరించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, సూర్య, కాశీ, హర్షవర్దన్, గుండు సుదర్శన్, కవిత, హేమ, అపూర్వ, దేవీశ్రీ తదితరులు నటిస్తున్నారు. జీవియస్ ఎంటర్ టైన్ మెంట్స్ కథ, ఎం.ఎం.విజయ్ సినిమాటోగ్రఫీ, వి.నాగిరెడ్డి ఎడిటింగ్ అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|