ప్రేమ 'ఫ్రూట్ సలాడ్'
ఏడు ప్రేమ కథలను మిళితం చేసి 'ఫ్రూడ్ సలాడ్' అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రేమలోని మాధుర్యం, బాధ, కన్నీళ్లు, త్యాగం, మోసాన్ని ఈ కథల ద్వారా తెలియజేసే ప్రయత్నమిది. సెవన్ హిల్స్ పతాకంపై సురేష్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఇనగడప సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇ.శ్రీనివాస్, శియా గౌతమ్ ('నేనింతే' ఫేమ్) హీరోహీరోయిన్లు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో శుక్రవారంనాడు ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి హీరోలు తనీష్, నిఖిల్, సందీప్ కలిసి క్లాప్ ఇవ్వగా, తారకరత్న, సి.కల్మాణ్ కలిసి కెమెరా స్విచ్చాన్ చేశారు.
ప్రేమకూ, పండుకూ దగ్గర సంబంధం ఉందనీ, పండులాగా ప్రేమ కూడా మధురంగా ఉంటుందనీ, ఓ మంచి ప్రేమకథా చిత్రంగా 'ఫ్రూడ్ సలాడ్'ను తెరకెక్కించనున్నామనీ దర్శకుడు సురేష్ తెలిపారు. తనకు ఏడు సంఖ్య అంటే ఇష్టమని, ఈ చిత్రంలో ఏడు ప్రేమకథలను మిళితం చేశామని నిర్మాత సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఇది ఒకరకంగా ప్రయోగాత్మక చిత్రంగా చెప్పవచ్చని అన్నారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ, తన స్వస్థలం అమలాపురం అనీ, చెన్నైలో ఎంబిఏ చేసిన తాను ఇక్కడే ఉంటున్నాననీ చెప్పారు. తమిళ 'చంద్రముఖి'లో సెకెండ్ హీరోగా నటించాననీ, ఇప్పుడు తన మాతృభాష అయిన తెలుగులో నటిస్తుండటం సంతోషంగా ఉందనీ అన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సౌమ్య, సంజు, సాయి, సందీప్తి, పావనిరడ్డి, స్వప్న, బాబి, శ్రీరామ్, అమృత, బ్రహ్మాజీ, సూర్య, ఈనూబేడీ, పావలా శ్యామలా, సింధు తదితరులు నటిస్తున్నారు. ఓం ప్రకాష్ మార్తా మాటలు, ఎ.ఎం.విజయ్ సినిమాటోగ్రఫీ, ఆవుల వెంకటేష్ ఎడిటింగ్, సత్య వై సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|