'నమో వెంకటేశ'కు శ్రీకారం
విక్టరీ వెంకటేష్ 'చింతకాయల రవి' చిత్రం తర్వాత కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న 'ఈనాడు' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పూర్తి కావడంతో విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా మరో రెండు చిత్రాలకు కమిట్ అయ్యారు. ఆయన కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో 'నమో వెంకటేశ' చిత్రం లాంఛనంగా హైద్రాబాదాలో పూజా కార్యక్రమాలు జరుపుకొంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో '14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్' పతాకంపై అనిల్ సుంకర, ఆచంట గోపీనాథ్, ఆచంట రామ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకటేష్ సరసన త్రిష కథానాయికగా నటించనుంది. 'ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే' తర్వాత వెంకటేష్-త్రిష కలిసి నటిస్తున్న సినిమా ఇదే. గోపీమోహన్ కథ అఁదింస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జూలై రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని సంస్థ వర్గాలు తెలిపాయి.
వెంకటేష్ కథానాయకుడుగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో మరో కొత్త చిత్రం కూడా ఇటీవల పూజా కార్యక్రమాలు జరుపుకొంది. వెంకటేష్ తో పలు హిట్ చిత్రాలు అందించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రానికి నిర్మాత. వెంకీ సరసన ఇలియానా కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా వెంకటేష్ అగ్ర హీరోల్లో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
Be first to comment on this News / Article!
|