గాయపడిన 'విజేత'
'హ్యాపీడేస్', 'కొత్త బంగారులోకం' వంటి వరుస సక్సెస్ ల తర్వాత వరుణ్ సందేశ్ కథానాయకుడుగా 'విజేత' చిత్రం తెరకెక్కుతోంది. తొలుత ఈ చిత్రానికి 'బైక్', 'కుర్రాడు' అనే టైటిల్స్ పరిశీలనలోకి వచ్చినప్పటికీ చివరకు 'విజేత' అనే టైటిల్ నే కన్ ఫర్మ్ చేసినట్టు సమాచారం. ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు కుమారుడు గుణ్ణం సందీప్ ('అమ్మచెప్పింది' సినిమాటోగ్రాఫర్) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జెమినీ ఫిలిమ్ సర్క్యూట్స్ బ్యానర్ పై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన 'పొల్లాధవన్' చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. కొద్దిపాటి ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా మూడు రోజుల క్రితం వరుణ్ సందేశ్ గాయపడినట్టు ఆలస్యంగా అందిన సమాచరం ప్రకారం తెలిసింది. హైటెక్ సిటీ సమీపంలో రాత్రివేళ ఓ ఆటోలో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తుండగా వరుణ్ గాయపడినట్టు తెలిసింది. దీంతో ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయవద్దని వరుణ్ కోరినట్టు తెలుస్తోంది. రెండ్రోజుల విరామం తర్వాత మళ్లీ ఆయన షూటింగ్ లో పాల్గొంటున్నారు.
బైక్ చుట్టూ నడిచే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో హీరోకి బైక్ అంటే చాలా ఇష్టం. మధ్య తరగతి ఉద్యోగి అయిన హీరో తండ్రి బైక్ కొనపెట్టడానికి ఇష్టపడడు. ఓ రోజు తండ్రితో గొడవపడటంతో ఆయన తన పెన్ష్ న్ సొమ్ము 50 వేల రూపాయలు కొడుక్కి ఇచ్చేస్తాడు. దీంతో హీరో బైక్ కొనుక్కుంటాడు. బైక్ వచ్చిన వేళా విశేషంతో అతనికి ఉద్యోగం వస్తుంది. ఓ అమ్మాయి ప్రేమలో కూడా పడతాడు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో బైక్ దొంగతనం జరుగుతుంది. ఆ తర్వాత హీరో జాబ్ పోతుంది. గర్ల్ ఫ్రెండ్ దూరమవుతుంది. బైక్ ను వెదికే ప్రయత్నంలో హీరో ఓ డాన్ తో తలపడతాడు. ఆ తర్వాత కథ ఆసక్తికరంగా సాగుతుంది. తమిళంలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ చేసిన ఈ పాత్రను తెలుగులో వరుణ్ పోషించారు. ఇందుకోసం వరుణ్ సిక్స్ ప్యాక్స్ డవలప్ చేశారని కూడా తెలుస్తోంది. వరుణ్ కు జోడిగా 'చిరుత' ఫేమ్ నేహాశర్మ నటించింది.
Be first to comment on this News / Article!
|