'స్నేహితుడా' ఆడియో
నాని, మాధవీ లత జంటగా జెమినీ ఫిలిం సర్క్యూట్స్ సమర్పణలో సత్య ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'స్నేహితుడా'. ఈ చిత్రానికి సత్యం బెల్లంకొండ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో శుక్రవారం సాయంత్రం జరిగింది. రమేష్ ప్రసాద్, శ్యాంప్రసాద్ రెడ్డి, పోకూరి బాబూరావు, భీమినేని శ్రీనివాసరావు, చిత్ర సంగీత దర్శకుడు రవిశంకర్ ప్రసాద్, నాని, మాధవీ లత తదితరులు పాల్గొన్నారు. ఆడియో క్యాసెట్ ను రమేష్ ప్రసాద్ ఆవిష్కరించి తొలి ప్రతిని శ్యాంప్రసాద్ రెడ్డికి అందజేశారు. ఆడియో సీడీని హీరో గోపీచంద్ ఆవిష్కరించి పోకూరి బాబూరావుకు అందజేశారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
గోపీచంద్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని పాటలన్నీ బాగున్నాయనీ, ఆడియోతో పాటు సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. పోకూరి బాబూరావు మాట్లాడుతూ, దర్శకుడు సత్యం తమ బ్యానర్ లో నాలుగు సినిమాలకు పనిచేశారని చెప్పారు. మంచి ప్రతిభ ఉన్న ఆయనకు జెమినీ సంస్థ అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రెండు హిట్ల తర్వాత నానీ చూడముచ్చడగా ఉన్నాడనీ, మాధవీ లత తన తొలి సినిమాలోనే మంచి మెచ్యూరిటీ చూపించిందనీ అన్నారు. ఇవాల్టి ట్రెండ్ లో పెద్ద స్టార్స్, బ్యాండ్ వాల్యూతో నిమిత్తం లేకుండా మంచి కాన్సెప్ట్ తో ముందుకు వస్తే ప్రేక్షకులు ఆ చిత్రాలను ఆదరిస్తున్నారని శ్యాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నాని నటించిన 'రైడ్' సినిమా చూశాననీ, అతనిలో మంచి ఎనర్జీ కనపించిందనీ ప్రశంసించారు. సంగీత దర్శకుడు శివ శంకర్ మాట్లాడుతూ, 'ప్రియమైన నీకు' చిత్రం తర్వాత మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాననీ, ఈ చిత్రం తనకు అలాంటి బ్రేక్ ఇస్తుందనే గట్టి నమ్మకం ఉందనీ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరిందనీ, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోందనీ చెప్పారు. ఈ చిత్రం మంచి హిట్ సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. నాని మాట్లాడుతూ, ద్వితీయ విఘ్నం లేకుండా 'రైడ్' చిత్రం సకెస్స్ కావడం తనకెంతో సంతోషం కలిగించిందనీ, ఎంతో హ్యాపీగా ఈ చిత్రానికి వర్క్ చేశాననీ చెప్పారు. శివశంకర్ మంచి సంగీతం అందించినట్టు పేర్కొన్నారు. అనుబంధాలను తెలియజెప్పే మంచి కథా చిత్రమిదని మాధవి లత పేర్కొంది. ఇదొక సున్నితమైన ప్రేమకథా చిత్రమనీ, ఫ్యామిలీ డ్రామా, చక్కటి ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు.
Be first to comment on this News / Article!
|