'ప్రవరాఖ్యుడు' మొదలైంది
అజయ్ ను హీరోగా పరిచయం చేస్తూ ఈమధ్యనే 'ఆ ఒక్కడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన 'టాలీ 2 హాలీ' ఫిలిమ్స్ సంస్థ మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టింది. జగపతిబాబు, ప్రియమణి జంటగా మదన్ దర్శకత్వంలో 'ప్రవరాఖ్యుడు' పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈనెల 15 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైద్రాబాద్ లో ప్రారంభించినట్టు చిత్ర నిర్మాత గణేష్ ఇందుకూరి తెలిపారు.
'పెళ్లైన కొత్తలో' వంటి విజయవంతమైన చిత్రం తర్వాత జగపతిబాబు, ప్రియమణి, దర్శకుడు మదన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇదనీ, సహజంగానే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ తో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ అంచనాలు ఉంటాయనీ, వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్ర కథ-కథనాలు ఉంటాయని ఆయన చెప్పారు. 15 నుంచి ప్రారంభమైన రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ వరకూ నిరవధికంగా ఉంటుందనీ, ఆగస్టులో ఒక షెడ్యూల్ దక్షిణాఫ్రికాలో చేస్తామనీ చెప్పారు. డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. దర్శకుడు మదన్ మాట్లాడుతూ, మంచి కథ కావడంతో 'పెళ్లయిన కొత్తలో' హీరోహీరోయిన్లను ఇందులో రిపీట్ చేస్తున్నామని చెప్పారు. పరిణతి చెందిన ప్రేమ జంట కథే ఈ 'ప్రవరాఖ్యుడు' అని చెప్పారు. మహిళా కళాశాల లెక్చరర్ గా జగపతిబాబు కనిపిస్తారనీ, భిన్నమైన షేడ్స్, భావోద్వోగాలు కలిగిన పాత్రలో ప్రియమణి నటిస్తోందని చెప్పారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో బ్రహ్మానందం, ఆలీ, సునీల్, ధర్మవరపు, చలపతిరావు, రాజ్యలక్ష్మి, మధుశర్మ, హంసానందిని, అనితానాథ్ తదితరులు నటిస్తున్నారు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే సైతం మదన్ అందిస్తుండగా, చెతన్య ప్రసాద్ పాటలు, సురేందర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Be first to comment on this News / Article!
|