'ఉత్సవమ్' ఆడియో రిలీజ్
ఇండో మోషన్ పిక్చర్స్ పతాకంపై హిందీలో 'రాయల్ ఉత్సవమ్' పేరుతో రూపొందిన చిత్రాన్ని తెలుగులో 'ఉత్సవమ్'గా అనువదించారు. రవి కె.పట్వా దర్శకత్వంలో వై.సోమశేఖర్ రెడ్డి, బి.వై.రాజారెడ్డి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. సుప్రీం మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదలైంది.
చారిత్రక నేపథ్యంలో రూపొందిన రొమాంటిక్ స్టోరీ ఇదనీ, ఈ చిత్రం విజయం సాధించి సోమశేఖర్ రెడ్డి, రాజారెడ్డిలు స్ట్రయిట్ చిత్రం స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నట్టు సి.కల్యాణ్ పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలు ఈ సినిమా గురించి వివరిస్తూ...ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తన మరణానికి ముందు యుద్ధకాంక్షను వీడి ప్రేమతత్వాన్ని తెలుసుకుంటాడు. మరుజన్మలో సికిందర్ గా పుట్టి తన ప్రేమయాత్రను భారతదేశంలో ప్రారంభిస్తాడు. ప్రేమకు బానిసై ఉజ్జయిని మహారాణి మేనకు అమ్ముడుపోతాడు. అతని చేష్టలు వాత్సాయుని రచనకు ప్రేరణగా ఉంటుంది. కవి కాళిదాసుని స్నేహ సాంగత్యం అతని జీవితానికి ఓ వెలుగు నిస్తుంది. చక్కటి సందేశం కూడా ఈ చిత్రంలో ఇమిడి ఉంటుందని చెప్పారు. వచ్చే నెలలో విడుదల కానున్న ఈ చిత్రంలో ప్రవీణ్ కుమార్, సుదేష్ బేరి, త్రిప్త తదితరులు నటించారు. ఈ చిత్రానికి లక్ష్మణసాయి మాటలు, వెంకటస్వామి నాయుడు-లక్ష్మణ సాయి పాటలు, వైష్ణవ్ దేవా, ర్యాన్ సంగీతం అందించారు. ఆడియో విడుదల కార్యక్రమంలో ఫరాఖాన్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Be first to comment on this News / Article!
|