నిర్మాతలుగా మారుతున్న సంగీత దర్శకుల జాబితాలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ కూడా చేరబోతున్నారు. రాశిపరంగా ఏటా ఎక్కువ సినిమాలకు సంగీతం అందిస్తున్న మణిశర్మ ఇటీవల కాలంలో తన సత్తా నిరూపించుకోవడంలో కొద్దిగా వెనుకబడినట్టే కనిపిస్తుంది. ఆయన తన అభిరుచి మేరకు అడపాదడపా వెండితెరపై చిన్నాచితకా పాత్రల్లో కనిపించిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఆయన మరో బృహత్తర బాధ్యతను చేపట్టబోతున్నారు. ఇటీవల 'బోణి' చిత్రంతో నిర్మాతగా మారిన రమణ గోగుల తరహాలోనే మణిశర్మ కూడా ఇప్పుడు నిర్మాతగా మారి సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓషన్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. వరుణ్ సందేష్ (హ్యాపీడేస్..కొత్త బంగారులోకం ఫేమ్) కథానాయకుడుగా తొలి చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.
ఇవాల్టి యువహీరోల్లో వరుణ్ సందేష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రెండు హిట్ల తర్వాత ఆయన ఈవారంలోనే 'ఎవరైనా ఎపుడైనా' చిత్రంతో హ్యాట్రిక్ కు సిద్ధమవుతున్నారు. ఎవిఎం బ్యానర్ లో ఈ చిత్రం రూపొందడంతో సహజంగానే మంచి అంచనాలు ఉన్నాయి. దీని తర్వాత జెమినీ సర్క్యూట్స్ నిర్మిస్తున్న 'విజేత' చిత్రం విడుదలవుతుంది. తమిళ 'పొల్లధావన్'కు ఇది రీమేక్. ఈ చిత్రం తర్వాత
దిల్ రాజు నిర్మాతగా 'మరో చరిత్ర' చిత్రానికి కూడా వరుణ్ కమిట్ అయ్యారు. తాజాగా మణిశర్మ చిత్రానికి కూడా వరుణ్ సందేష్ గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. ఈ చిత్రంలోని పాటలను సింగిల్ కార్డ్ పై వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అందించనుండగా, మణిశర్మ సంగీతం అందించనున్నారు. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.