హీరోగా అచ్చిరెడ్డి తనయుడు
అన్ని రంగాల్లో మాదిరిగానే సినీ రంగంలోనూ వారసుల ప్రవేశం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. నట వారసత్వం అనేది సినిమాల్లోకి రావడానికి ఎంట్రీ పాస్ అయినప్పటికీ ఒకటి రెండు సినిమాల్లోనే తమ ప్రతిభను చాటుకున్న నట వారసులు మాత్రమే ఫీల్డ్ లో నిలబడుతుంటారు. ఇటీవల కాలంలో భానుచందర్, బహ్మానందం, ఏవియస్ వంటి నటుల కుమారులు హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి కూడా తన కుమారుడు నితీష్ ని హీరో పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పరిశ్రమలో కృష్ణార్జునులుగా ఎస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డికి పేరుంది. ఎస్.వి.కృష్ణారెడ్డి తీసిన పలు చిత్రాలను కృష్ణారెడ్డి నిర్మించారు. ఇటీవల కాలంలో కృష్ణారెడ్డి ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ తీస్తున్న చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్యానర్ పై ఇటీవల వచ్చిన 'కిక్' మంచి సక్సెస్ ను సాధించింది. తన కుమారుడు నితీష్ ను హీరోగా పరిచయం చేయడానికి ఇదే మంచి తరుణంగా అచ్చిరెడ్డి భావిస్తున్నారు. ఈ చిత్రానికి 'మనసా తుళ్లిపడకే' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. టీనేజ్ ప్రేమకథా ఇతివృత్తంగా ఈ చిత్రం తెరకెక్కనుందనీ, పి.బాలాజీ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేయనున్నారనీ తెలుస్తోంది. జూలై 3న ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తెచ్చేందుకు అచ్చిరెడ్డి ప్లాన్ చేస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలనే వెల్లడి చేయనున్నారు.
Be first to comment on this News / Article!
|