'ఎక్కడా...' అంటూ సాగతీత డైలాగ్స్ తో, గ్లామర్ సొగసులతో యువతరం హృదయాలకు గాలం వేసిన శ్వేతాబసు ప్రసాద్ టాలీవుడ్ లో ఇప్పుడు బిజీ ఆఫర్లతో దూసుకుపోతుంది. 'కొత్తబంగారులోకం' చిత్రంలో తండ్రి చాటు ఆడపిల్లగా కనిపించి తొలి హిట్ సాధించిన శ్వేత తాజాగా 'రైడ్' చిత్రం ద్వారా గ్లామర్ పాత్రలకు తెరతీసింది. శ్వేతబసు గ్లామర్ పోస్టర్లు ఈ చిత్రం పబ్లిసిటీకి బాగా ఉపయోగపడ్డాయి. పనిలో పనిగా శ్వేత తన సంతోషాన్ని మీడియాతో కూడా పంచుకుంటూ అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమధ్య ఓ యువకుడితో శ్వేత డేటింగ్ కూడా చేసినట్టు నవ్వుతూ చెప్పుకొచ్చింది.
'అప్పట్లో ఓ సర్దార్జీతో డేటింగ్ చేశాను. అయితే ఆ తర్వాత ఆ వ్యవహారానికి స్వస్తి చెప్పాను కూడా' అంటూ తన తాజా ఇంటర్వ్యూలో శ్వేత చెప్పుకొచ్చింది. 'కొత్త బంగారులోకం' చిత్రంలో తన పాత్రకు భిన్నంగా నిజజీవితంలో అమ్మానాన్నలు తనకు ఎప్పుడూ తగినంత స్వేచ్ఛ ఇస్తూ వచ్చారని తెలిపింది. అందుకు తగ్గట్టే అమ్మ చూపించిన వ్యక్తినే తాను పెళ్లి చేసుకుంటానని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కెరీర్ పైనే తన దృష్టి సారించానని తెలిపింది. అందుకు తగ్గట్టే ప్రస్తుతం రెండు సినిమాలు శ్వేత చేతుల్లో ఉన్నాయి. కోదండరామిరెడ్డి తనయుడు వల్లభ సరసన ఓ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా నిఖిల్ కథానాయకుడుగా డి.ఎస్.రావు ('ద్రోణ' ఫేమ్) నిర్మించనున్న కొత్తి చిత్రానికి కూడా శ్వేత కమిట్ అయింది. ఈ రెండు చిత్రాలతో తెలుగులో తనకు మరింత క్రేజ్ వస్తుందనే గట్టి నమ్మకంతో ఆమె ఉంది.