'రాజు-మహరాజు'కు ఆదరణ
సకుటుంబ కథా చిత్రంగా 'రాజు మహరాజు' ప్రేక్షకాదరణ చూరగొంటోందని చిత్ర నిర్మాత కుమారస్వామి తెలిపారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ, శర్వానంద్, సుర్విన్ చావ్లా, తషుకౌశిక్ ప్రధాన పాత్రధారులుగా దుర్గాశంకర్ నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హైద్రాబాద్ లోని ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ లో మంగళవారంనాడు ఈ చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాలలోనూ మహిళా ప్రేక్షకుల కంటే పురుష ప్రేక్షకుల సంఖ్య అధికంగా ఉందనీ, సినిమా బాగుండటంతో రోజురోజుకీ మహిళా ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుందని ఆశిస్తున్నామనీ నిర్మాత పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలోనూ రాజకీయాలు నెలకొన్నాయని ఆయన చెబుతూ మరోసారి దీని గురించి వివరంగా తెలియజేస్తానని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఎలా ఉండాలో చాటిచెప్పే చిత్రమిదని దుర్గాశంకర్ నాథ్ అన్నారు. ఇలాంటి ఫ్యామిలీ చిత్రాలను విజయవంతం చేస్తే మరిన్ని చిత్రాలు వచ్చేందుకు వీలవుతుందని అన్నారు. ఈ చిత్రంతో 'గమ్యం' తర్వాత ఓ మంచి సినిమా చేశాననే సంతృప్తి కలిగినట్టు హీరో శర్వానంద్ పేర్కొన్నారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ వంటి సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం తీయని అనుభూతినిచ్చినట్టు చెప్పారు. తషు కౌశిక్, సురేఖ వాణి కూడా సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|