'చిరుత'లోని వేగాన్ని తన తొలిచిత్రంలోనే చూపిన రామ్ చరణ్ ద్వితీయ ప్రయత్నంగా 'మగధీర'గా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈనెల 28న శిల్పకలా వేదకపై ప్రతిష్ఠాత్మకంగా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించనున్నారు. 'యమదొంగ' తర్వాత దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి ఇది మరో ఛాలెంజింగ్ ఫిల్మ్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు కూడా తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ ఎక్కువ గ్యాప్ లేకుండానే తన మూడో చిత్రానికి కూడా సన్నద్ధమవుతున్నారు. 'బొమ్మరిల్లు', 'పరుగు' చిత్రాల ఫేమ్ భాస్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. రామ్ చరణ్ కు జోడిగా జెనీలియా తొలిసారి ఈ చిత్రంలో నటించనుంది.
అంజనా ప్రొడక్షన్ బ్యానర్ పై నాగబాబు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. హారిస్ జైరాస్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్తచిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అమెరికాలో చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.