ప్రియమణి చేజారిన అవార్డు
తమిళ 'పరుత్తి వీరన్' చిత్రంలో మేకప్ లేకుండా నటించి ఉత్తమటిగా జాతీయ అవార్డును అందుకున్న అందాల నటి ప్రియమణికి ఇప్పుడు తృటిలో కేరళ స్టేట్ అవార్డు చేజారిపోయింది. మలయాళంలో ఆమె 'తిరైకథ' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రంలో ప్రియమణి నటనకు అరుదైన ప్రశంసలు దక్కాయి. ఇటీవల కేన్సర్స్ తో కన్నుమూసిన ప్రముఖ నటి శ్రీవిద్య జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ప్రియమణి నటనకు ఉత్తమ నటిగా స్టేట్ అవార్డు రావడం ఖాయమని చాలామంది అనుకున్నారు. అయితే ఆ అవార్డును మరో నటి ప్రియాంక ఎగరేసుకుపోయింది. ఉత్తమ నటి ఎంపిక విషయంలో ప్రియాంకకు ప్రియమణి గట్టిపోటీనే ఇచ్చింది. అయితే ప్రియాంక స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం, ప్రియమణి ఆ పని చేయలేకపోవడంతో ప్రియమణికి అవార్డు ముఖం చాటేసింది.
ఉత్తమ నటి అవార్డు చేజారిపోవడం బాధాకరమే అయినా, మలయాళ ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్నందుకు సంతోషంగా ఉందని ప్రియమణి చెప్పుకొచ్చింది. తాను మలయాళం మాట్లాడగలిగినప్పటికీ భాష మీద సరైన పట్టులేకపోవడంతో డబ్బింగ్ చెప్పలేకపోయానని వివరణ ఇచ్చింది. భవిష్యత్తులో తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ధీమాగా చెప్పింది. ప్రియమణికి మలయాళంలో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని పలువురు మలయాళ నిర్మాతలు ఆమె నటించిన తెలుగు, తమిళ చిత్రాలను అనువాదరూపంలో విడుదల చేసే పనిలో ప్రస్తుతం బిజీగా ఉన్నారట.
Be first to comment on this News / Article!
|