'వెంగమాంబ' పాటలు భేష్
శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా తరిగొండ వెంగమాంబ చరిత్రలో ఓ సుస్థిర స్థానం సంపాందించుకుంది. 'అన్నమయ్య' వంటి భక్తిరస చిత్రాన్ని అందించిన వి.ఎం.సి. ప్రొడక్షన్స్ అధినేత దొరస్వామి రాజు ఇప్పుడు తరిగొండ వెంకమాంబ చరిత్రను ప్రేక్షకులను అందిస్తున్నారు. 'వెంగమాంబ' పేరుతో రూపొందిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. టైటిల్ పాత్రను మీనా, వేంకటేశ్వర స్వామి పాత్రను సాయికిరణ్ పోషించారు. ఉదయ్ భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇటీవల తిరుపతిలో విడుదలైన ఈ చిత్రం ఆడియోకి మంచి స్పందన లభిస్తోంది. హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు, పలువురు అతిథులు పాల్గొని ఈ చిత్రంలోని పాటలు బాగున్నాయంటూ తమ స్పందనను తెలియజేశారు.
అతిథిగా పాల్గొన్న చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉత్తమాభిరుచితో చిత్రాలను తీసిన నిర్మతగా దొరస్వామిరాజుకు మంచి పేరుందనీ, అలా తీసిన వెంగమాంబ చిత్రం కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ అన్నారు. చిత్ర కథారచయిత ముక్తేవి భారతి మాట్లాడుతూ, తాను రాసిన వెంకమాంబ కథను సీరియల్ గానూ, సినిమాగానూ తీసిన దొరస్వామి రాజుకు తన కృతజ్ఞతలని అన్నారు. వెంకమాంబ జీవితంలోని అన్ని కోణాలు పాటల్లో ప్రతిబింబిస్తాయనీ, భక్తిరసం తొణికిసలాడుతోందనీ అన్నారు. గతంలో 'అన్నమయ్య', ఇప్పుడు 'వెంగమాంబ' చిత్రాలను తీసే అవకాశం కలగడం తన పూర్వజన్మ సుకృతమని దొరస్వామి రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం డబ్బింగ్ పూర్తి చేసుకుని రీరికార్డింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రాన్ని జూలై ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, భక్తురాలిగానే కాకుండా 17వ శతాబ్దంలోనే స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలపై పోరాటం చేసిన మహిళ వెంగమాంబ అని చెప్పారు. కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలోని 21 పాటలు ప్రతి ఒక్కరినీ అలరిస్తున్నాయని తెలిపారు. కీరవాణి మాట్లాడుతూ, 87 నందులు అందుకున్న ఉదయ్ భాస్కర్ దర్శకత్వంలో దొరస్వామిరాజు ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని తెరకెక్కిస్తున్నారని చెప్పారు. పాటలకు మంచి స్పందన లభిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం.వి.ఎస్.ప్రసాద్, నటులు మాడా, అనంత్, గాయకుడు వి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|