సినీప్రియులకు బిజీ వారం
ఈ వారంతంలో 4 సినిమాలు విడుదలవుతూ సినీ అభిమానుల్లో సందడి సృష్టించబోతున్నాయి. వరుణ్ సందేష్ 'ఎవరైనా ఎపుడైనా..' (ప్రేమలో పడొచ్చు), పరుచూరి రవిబాబు 'జంక్షన్' చిత్రాలు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. శేఖర్ కమ్ముల 'హ్యాపీడేస్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి ఆ తర్వాత 'కొత్త బంగారులోకం' వంటి మరో హిట్ ను సొంతం చేసుకున్న వరుణ్ సందేష్ ఇప్పుడు 'ఎవరైనా ఎపుడైనా' అనే ప్రేమకథా ఇతివృత్తంతో అలరించబోతున్నారు. ప్రతిష్ఠాత్మక ఎవిఎం బ్యానర్ పై ఎం.శరవణన్, గుహన్ నిర్మించిన ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేష్ సోదరుడు మార్తాండ్ కె శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎన్ఆర్ఐ ముద్దుగుమ్మ విమలారామన్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే అందరి అభిమానం చూరగొంటోంది. ఇదే శుక్రవారం విడుదలవుతున్న మరో చిత్రం 'జంక్షన్'. ప్రముఖ రచయిత పరుచూరి వెంకటశ్వరరావు తనయుడు పరుచూరి రవిబాబు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. ఒరియా, బెంగాళీ భాషా చిత్రాల్లో నటించిన నైన హీరోయిన్ గా తొలిసారి తెలుగు తెరకు పరిచయమవుతోంది. కె.అనిల్ కృష్ణ దర్శకుడు.
శనివారం విడుదలవుతున్న చిత్రాల్లో 'అంజనీపుత్రుడు', 'రూ.999 మాత్రమే' ఉన్నాయి. కొణిదెల నాగేంద్రబాబు, ప్రేమ ప్రధాన పాత్రల్లో సోషియో ఫాంటసీగా ఈ చిత్రాన్ని దర్శకుడు కె.చంద్రశేఖర్ తెరకెక్కించారు. అంజనీపుత్రుని విన్యాసాలు గ్రాఫిక్ మేళవింపులతో హైలైట్ గా ఉండబోతున్నట్టు నిర్మాతలు చెబుతున్నారు. 'రూ.999 మాత్రమే ' చిత్రం ద్వారా కౌటిల్య, ప్రభాకర్, మధు, అనిల్, ప్రవీణ్ బాబు, క్రిష వంటి కొత్తతారలు పరిచయమవుతున్నారు. పర్స మహేందర్ దర్శకత్వంలో గోవింద్ నవీన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డాక్టర్ బ్రహ్మానందం ఓ కీలక పాత్ర పోషించారు.
Be first to comment on this News / Article!
|