29 నుంచి మార్కెట్లో 'మగధీర'
'చిరుత'గా తొలి అడుగు వేసిన రామ్ చరణ్ తేజ ఇప్పుడు 'మగధీర' గా సంచలనాలు సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు. రామ్ చరణ్ తేజ, కాజల్ అగర్వాల్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సుమారు 35 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. వంద శాతం హిట్లతో విజయపథంలో దూసుకుపోతున్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఆడియో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సంగీత ప్రియులనకు ఆడియో సీడిలు, క్యాసెట్లు ఈనెల 29 నుంచి మార్కెట్ లో లభ్యం కానున్నాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో మార్కెట్ లోకి రానుంది.
ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా మాట్లాడుతూ, రామ్ చరణ్ తొలి చిత్రమైన 'చిరుత' పాటలను కూడా తామే విడుదల చేశామనీ, అప్పట్లో ఆ పాటలు సంచలనం సృష్టించాయని అన్నారు. మరోసారి 'మగధీర' పాటలను విడుదల చేసే అవకాశం తమకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. సుస్వరాల సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణితో తమ సంస్థకు ఎంతో అనుబంధం ఉందనీ, కీరవాణి స్వరపరచిన ఎన్నో హిట్ చిత్రాలను తమ సంస్థ ద్వారా విడుదల చేసామనీ అన్నారు. ఈసారి 'మగధీర' ఆడియో సీడీలతో పాటు పది ఎంపిత్రీ పాటల సీడీలను కూడా ఒకేసారి విడుదల చేస్తున్నామనీ, ఇలా రిలీజ్ చేయడం తెలుగు ఆడియో చరిత్రలో ఇదే మొదటిసారని చెప్పారు. ఎంపిత్రి పాటలు విడుదల చేయడం వల్ల పైరసీని అరిక్టేందుకు వీలుంటుందని అన్నారు.
Be first to comment on this News / Article!
|