ధనుష్ రీమే'కింగ్'
ఒకప్పుడు కొత్త తమిళ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా, రీమేక్ హక్కలు ఎప్పుడు సొంతం చేసుకుందామా అని తెలుగు సినీ నిర్మాతలు ఎదురూచూపులు చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. తెలుగులో కొత్త సినిమా రిలీజ్ అవుతోందంటో తమిళ నిర్మాతలు, హీరోలు క్యూలు కడుతున్నారు. ఇటీవల కాలంలో తమిళంలో హిట్టయిన పలు చిత్రాలు తెలుగు నుంచి రీమేక్ అయినవే. 'వర్షం', 'బొమ్మరిల్లు', 'గమ్యం', 'పోకిరి'...ఇలా కొండవీటి చాంతాడంత జాబితా ఉంది. ముఖ్యంగా విజయ్, అజిత్, జయం రవి వంటి పలువురు హీరోలు రీమేక్స్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు రజనీకాంత్ అల్లుడు ధనుష్ సరికొత్త రీమేక్ ల 'కింగ్'గా అవతారమెత్తాడు. ధనుష్ కు తెలుగు సినిమాల రీమేక్ మోజు సెల్వరాఘువన్ 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే'తో మొదలైంది. ఆ చిత్రాన్ని 'యారడి నీ మోహిని' పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం తమిళనాట సూపర్ హిట్ అయింది.
ధనుష్ ప్రస్తుతం 'కుట్టీ' చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అల్లు అర్జున్ సూపర్ హిట్ చిత్రం 'ఆర్య'మాతృక. ఇక్కడితో ధనుష్ ఆగదలచుకోలేదు. తెలుగులో రామ్-జెనీలియా జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సూపర్ హిట్టయిన 'రెడీ' చిత్రంపై ధనుష్ కన్నేశారు. ఈ చిత్రం రీమేక్ లో నటించేందుకు ఆయన దాదాపు రంగం సిద్ధం చేసుకున్నారు. వీటికితోడు వెట్రిమారన్ 'అడుకలమ్', సూరజ్ దర్శకత్వంలో 'పడిక్కాదవన్', సెల్వ రాఘువన్ తో ఓ థ్రిల్లర్ చిత్రం కూడా ధనుష్ చేతిలో ఉన్నాయి. రీమేక్స్ మోజులో ఉన్న ధనుష్ ఓ తెలుగు స్ట్రయిట్ చిత్రంలో నటించే రోజు ఎప్పుడొస్తుందో మరి...
Be first to comment on this News / Article!
|