సంజన ఛలో అమెరికా
దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్లలో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే అంతా ఓ వెలుగు వెలినవారే. ఆయన పరిచయం చేసిన బెంగుళూరు బ్యూటీ సంజన కూడా ఇప్పుడు సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. మోడలింగ్ నుంచి ముడేళ్ల క్రితమే కన్నడంలో 'గండ హెండతి' చిత్రంతో అందర్నీ ఆకట్టుకున్న సంజన ఆ తర్వాత కూడా కన్నడంలో పలు చిత్రాలు చేసింది. పూరీ కంట్లో పడటంతో 'బుబ్జిగాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత రాజశేఖర్ సరసన 'సత్యమేవ జయతే'లోనూ నటించింది. ఆ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వైఫల్యాన్ని చవిచూసినా మరో రెండు సినిమాలు ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. నిన్నటి వరకూ వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉన్న సంజన ఇప్పుడు కాస్తంత తీరిక దొరకడంతో హాలిడే మూడ్ లో ఉంది. జూలై ప్రారంభంలో అమెరికా ట్రిప్ కోసం ఆమె రెడీ అవుతోంది. ఈసారి తన పర్యటనలో చక్కటి ప్రదేశాలు చూడడంతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కలుసుకోబోతున్నట్టు ఆమె సంబరంగా చెబుతోంది. ఆమె తప్పనిసరిగా చూడాలనుకుంటున్న వాటిల్లో 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ' ఒకటి.
'టూరిస్టులంతా తప్పనిసరిగా చూడాలనుకునే వాటిల్లో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒకటి. ఈసారి మాత్రం ఈ అవకాశం జారవిడుచుకోను' అంటోంది సంజన. తన పర్యటనలో భాగంగా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించనున్న కార్యక్రమంలో తెలుగు సినీ ప్రముఖులతో పాటు తాను కూడా పాల్గొంటాననీ, పలువురు దర్శకులు, నటులను కూడా కలుసుకుంటాననీ చెప్పుకొచ్చింది. కెరీర్ సంతృప్తిగా ఉందనీ, ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న రెండు చిత్రాలు తన కెరీర్ మరింత స్పీడ్ అందుకుంటుందనీ తెలిపింది. సంజన నటించిన 'పోలీస్ పోలీస్', 'సమర్ధుడు' చిత్రాలు నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Be first to comment on this News / Article!
|