విలక్షణ నటుడు పద్మశ్రీ కమల్ హాసన్ 'దశావతారం' తర్వాత ఎంతో ప్రిస్టేజియస్ గా 'మర్మయోగి' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నప్పటికీ ఆర్థికమాంద్య పరిస్థితి వల్ల ఆ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో ఆయన వెంటనే 'ఈనాడు' అనే ద్విభాషా చిత్రాన్ని ప్లాన్ చేసి అతి తక్కువ వ్యవధిలోనే షూటింగ్ చివరిదశకు తీసుకువచ్చారు. హిందీలో నీరజ్ పండే దర్శకత్వంలో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో ఘనవిజయం సాధించిన 'ది వెన్స్ డే' చిత్రానికి రీమేక్ గా 'ఈనాడు' రూపొందుతోంది. ప్రస్తుతం 95 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని తుది మెరుగుల దశలో ఈ చిత్రం ఉంది. ఆగస్టు 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కమల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
కమల్ ఈ తేదీని ఎంచుకోవడం వెనుక ఓ ప్రత్యేకత ఉంది. కమల్ బాలనటుడిగా తొలిసారి నటించిన 'కలత్తూర్ కన్నమ్మ' చిత్రం 1959 ఆగస్టు 12న విడుదలైంది. అంటే కమల్ కు ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ అన్నమాట. దీనిని దృష్టలో పెట్టుకునే కమల్ ప్రిస్టేజియస్ గా తన తాజా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని యుటివి ప్రొడక్షన్స్ తో కలిసి కమల్ తన సొంత బ్యానర్ రాజ్ కమల్ పతాకంపై నిర్మిస్తున్నారు. కమల్ 'సాగరసంగమం' చిత్రంలో బాల ఫోటోగ్రాఫర్ గా నటించిన చక్రి ఈ చిత్రానికి దర్శకత్వ వహిస్తున్నారు. శృతి కమల్ హాసన్ (కమల్ కుమార్తె) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో మరో విశేషం. ఆసక్తికరంగా ఈ చిత్రం తెలుగు వెర్షన్ (ఈనాడు)లో విక్టరీ వెంకటేష్ పవర్ ఫుల్ ఇన్ స్పెక్టర్ గా కీలక పాత్ర పోషిస్తున్నారు.