'జయం మనది' ఆడియో
ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తొలిసారి దర్శకత్వం వహించిన 'వాన' చిత్రం ద్వారా పరిచయమైన హీరో వినయ్ మరోసారి 'జయం మనది' అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో ఈ సినిమాను నిర్మించిన సత్యజ్యోతి ఫిలింస్ తెలుగులోకి అనువదించి విడుదల చేస్తోంది. కణ్ణన్ దర్శకుడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో బుధవారం రాత్రి నిర్వహించారు. ఆడియో సీడీని కోడి రామకృష్ణ ఆవిష్కరించి తొలి ప్రతిని నిర్మాతల్లో ఒకరైన త్యాగరాజన్ కు అందజేశారు.
పెళ్లికి ముందు నిశ్చితార్ధంలాగా సినిమా రిలీజుకు ముందు ఆడియో వేడుక పండుగలా జరుపుతామనీ, ఈ చిత్ర నిర్మాతలు చాలా సీనియర్లనీ, వారి గత చిత్రాల కోవలోనే ఈ చిత్రం కూడా ఉంటుందని తాను అనుకుంటున్నాననీ కోడిరామకృష్ణ పేర్కొన్నారు. విద్యాసాగర్ సంగీతం ఈ చిత్రానికి ఓ హైలైట్ అని అన్నారు. మరో అతిథి బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, తమిళంలో వసంతకోకిల, హృదయం వంటి పలు విజయవంతమైన చిత్రాలను తీసిన ఘనత ఈ నిర్మాతలకు దక్కుతుందన్నారు. ఈ చిత్రాన్ని రీమేక్ చేసేందుకు గట్టి పోటీ ఎదురైనా స్వయంగా వారే తెలుగులోకి అనువదిస్తున్నారని చెప్పారు. త్యాగరాజన్ మాట్లాడుతూ, తన తండ్రికి తెలుగు చిత్ర పరిశ్రమతో ఎంతో అనుంబంధం ఉందనీ, గతంలో కొందరు భాగస్వాములతో కలిసి వీనస్ పిక్చర్స్ పతాకంపై కొన్ని సినిమాలు తీశారనీ చెప్పారు.
తన బాల్య స్నేహితుడైన మణిరత్నాన్ని తానే దర్శకుడిగా పరిచయం చేశాననీ, ఇప్పుడు ఆయన శిష్యుడైనా కణ్ణన్ ను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయ చేశానననీ చెప్పారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా 'జయం మనది' చిత్రం ఉంటుందన్నారు. ఈ వేడుకలో హీరో వినయ్, మరో నిర్మాత టి.అర్జున్, దర్శకుడు కణ్ణన్, నగేష్ నారదాసి, మల్లూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Be first to comment on this News / Article!
|