కొత్త చిత్రంతో ఉదయ్ బర్త్ డే
కెరీర్ పరంగా కొద్దికాలంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హీరో ఉదయ్ కిరణ్ మొక్కవోని దైర్యం, ఆత్మవిశ్వాసంతో మరో వసంతంలోకి అడుగుపెట్టారు. శుక్రవారంనాడు తన జన్మదినోత్సవాన్ని హైద్రాబాద్ లో తన కొత్త చిత్రం యూనిట్ తో కలిసి జరుపుకొన్నారు. ప్రస్తుతం తమిళంలో ఒక చిత్రానికి ఉదయ్ కిరణ్ కమిట్ అయ్యారు. తాజాగా మరో అవకాశాన్ని కూడా ఆయన అందిపుచ్చుకున్నారు. చాణిక్య మీడియా పతాకంపై సుభా సెల్వం దర్శకత్వంలో డి.కుమార్, ఈశ్వర వరప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఉదయ్ కిరణ్ కు జోడిగా శ్వేతబసు ప్రసాద్ నటించనుంది. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమవుతుంది. ఈ చిత్ర యూనిట్ తో పాటు చదలవాడ శ్రీనివాసరావు, పల్లి కేశవరావు, సోమా విజయప్రకాష్ తదితర నిర్మాతలు ఉదయ్ కిరణ్ బర్తడే వేడుకలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయ్ కిరణ్ కేక్ కట్ చేసి తన సంతోషాన్నివీరందరితో పంచుకున్నారు.
ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, సక్సెస్, ఫెయిల్యూర్లకు అతీతంగా అభిమానులు తననెంతో అభిమానిస్తున్నారనీ, వారందరికీ తాను రుణపడి ఉంటాననీ అన్నారు. ఈ పుట్టినరోజుకు ఒక ప్రత్యేకత ఉందనీ, గతంలో ఎప్పుడూ తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయలేదనీ, ఈ సారి కొత్త అనుభూతి కలుగుతోందనీ అన్నారు. దర్శకుడు సెల్వం చెప్పిన కథ తననెంతో ఆకట్టుకుందనీ, అంతే అందంగా సినిమాను తెరకెక్కిస్తారనే నమ్మకం తనకుందనీ చెప్పారు. ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన ప్రేమకథా చిత్రమిదనీ, తప్పకుండా తనకు మంచి సినిమా అవుతుందనీ అన్నారు. సుభా సెల్వం మాట్లాడుతూ, తమిళంలో ఉదయ్ కిరణ్ 'పోయ్' సినిమా చేసినప్పుడే అతనితో ఓ సినిమా చేయాలనే ఆలోచన తనకు కలిగిందనీ, అది ఇప్పుడు కార్యరూపంలోకి రాబోతోందనీ అన్నారు. తమిళంలో 'రామేశ్వరం' చిత్రానికి తాను దర్శకత్వం వహించాననీ, తెలుగులో ఇదే తొలి చిత్రమనీ పేర్కొన్నారు. ఉదయ్ కిరణ్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అనిల్ తెలిపారు. రచయిత జనార్దన్ మహర్షి మాట్లాడుతూ, ఈ చిత్ర నిర్మాతలు తీసిన 'శ్రీరామచంద్రలు' చిత్రానికి తాను రచన చేశాననీ, ఈ చిత్రానికి ఎక్కువగా కష్టపడి మంచి రిజల్ట్ వచ్చేందుకు కృషి చేస్తాననీ చెప్పారు. ఉదయ్ కిరణ్ తో చేస్తున్న ఈ చిత్రం కూడా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నట్టు శ్వేతబసు ప్రసాద్ తెలిపింది.
Be first to comment on this News / Article!
|