వారం 'కరెంట్' 2.59 కోట్లు
అఖిలాంద్ర ప్రేక్షకుల ఆదరాభిమానాలతో 'కరెంట్' చిత్రం మంచి కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ఆ చిత్ర నిర్మాతలు చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల తెలిపారు. సుశాంత్, స్నేహఉల్లాల్ జంటగా సూర్యప్రతాప్ దర్శకత్వంలో నాగ్ కార్పొరేషన్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 19న విడుదైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను హైద్రాబాద్ లోని సంస్థ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. హీరో సుశాంత్ కూడా పాల్గొన్నారు.
చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, సుశాంత్ తొలిచిత్రమైన 'కాళిదాసు' 100 రోజులు సాధించిన కలెక్షన్ షేర్ ను 'కరెంట్'చిత్రం వారం రోజుల్లోనే అధిగమించిందని చెప్పారు. 2.59 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ లభిస్తే అందులో 1.41 లక్షల షేర్ లభించిందన్నారు. సుశాంత్ నటన, ఫైట్స్, డాన్స్ లను ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారనీ, ప్రత్యేకించి యూత్ ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న తీరు తమకెంతో సంతోషం కలిగిస్తోందనీ చెప్పారు. దర్శకుడు సూర్యప్రతాప్ ఈ చిత్రాన్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించారనీ, దేవీశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్ర విజయానికి ఎంతో దోహద పడిందన్నారు. ప్రేక్షకులతో పాటు అక్కినేని అభిమానులకు ఈ చిత్రం ఎంతగానో నచ్చిందనీ, ఆ విషయాన్ని ఫోన్లు చేసి మరీ చెబుతున్నారనీ నాగసుశీల పేర్కొన్నారు. నాన్నగారితో పాటు, సోదరుడు నాగార్జున కూడా మార్నింగ్ షో పూర్తి కావడంతోనే తనకు ఫోన్ చేసి అభినందించారని తెలిపారు. మంచి కథ కుదరగానే కొత్త చిత్రాన్ని ప్రకటిస్తామనీ, బయట సంస్థలతో కూడా సుశాంత్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడనీ నాగసుశీల వివరించారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ, హైద్రాబాద్ లో ఈ చిత్రం ప్రదర్శిస్తున్న సంధ్య, శివపార్వతి థియేటర్లలో తాను ప్రేక్షకులను కలవడం జరిగిందనీ, అందరూ ఎంతో బాగా ఈ చిత్రాన్ని, తననూ రిసీవ్ చేసుకున్నారనీ చెప్పారు. ఈనెల 28న విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో ఈ చిత్రం ఆడియా ట్రిపుల్ ప్లాటినం డిస్క్ వేడుక నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో తనతో పాటు స్నేహ ఉల్లాల్, దేవీశ్రీ ప్రసాద్, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొంటారని చెప్పారు. అలాగే దేవీశ్రీ ప్రసాద్ డాన్స్ షో కూడా ఉంటుందని వివరించారు. తన చిత్రాన్ని ఇంత మంచి హిట్ చేసిన ప్రేక్షకాభిమానులను త్వరలోనే కలుసుకునేందుకు 'కరెంట్...కనెక్టింగ్ హార్ట్' పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల్లో విజయ యాత్రలు నిర్వహిస్తారమని చెప్పారు.
Be first to comment on this News / Article!
|