ఉచితంగా సినిమాలు చూడొచ్చు
బాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థగా 'మైనే ప్యార్ కియా', 'వివాహ్' వంటి పలు బ్లాక్ బస్టర్లు అందించిన రాజశ్రీ సంస్థ ఇప్పుడు ఇంటర్నెట్ మాధ్యమంలోకి అడుగుపెట్టింది. ఇంటర్నెట్ లో హిందీతో పాటు ఇతర భాషా చిత్రాలను ఉచితంగా చూసే సదుపాయాన్ని కల్పిస్తూ తెలుగులో ఓ వెబ్ సైట్ ను ప్రారంభించింది. 'రాజశ్రీ తెలుగు.కామ్' పేరుతో ఈ వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ సైట్ లో పలు తెలుగు సినిమాలను ఉచితంగా చూడవచ్చు. రాజశ్రీ సంస్థ వ్యవస్థాపకుడు తారానంద్ బర్ జాత్య మనువడు రజ్జత్ ఎ.భర్జాత్య హైద్రాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఈ విషయాలు తెలియజేశారు. డాక్టర్ డి.రామానాయుడు, రమేష్ ప్రసాద్, డి.సురేష్ బాబు సైతం పాల్గొన్నారు.
రజ్జత్ భర్జాత్యా మాట్లాడుతూ, విదేశాల్లోని తెలుగువారికి తెలుగు సినిమాలు చాలా వరకూ రీచ్ కావడం లేదనీ, ఆ కొరతను ఈ వెబ్ సైట్ తీరుస్తుందనీ అన్నారు. ఇప్పటి వరకూ వెయ్యి సినిమాల హక్కులను సొంతం చేసుకున్నామని చెప్పారు. ఇంటర్నెట్ లో ఈ సినిమాలను ఉచితంగా చూడవచ్చనీ, డౌన్ లోడ్ చేసుకునే సౌకర్యం మాత్రం కల్పించలేదనీ చెప్పారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ, తమ నాన్నగారి నాటి నుంచి రాజశ్రీ వారితో అనుబంధం కొనసాగుతోందనీ, తమ సంస్థలో నిర్మించిన సినిమాలు కావాలని రజ్జిత్ అడగ్గానే ఇవ్వడానికి అంగీకరించాననీ చెప్పారు. డి.రామానాయుడు మాట్లాడుతూ, తాను పరిశ్రమలోకి అడుగుపెట్టే సరికే రాజశ్రీ అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతోందనీ, రజిత్ తాతగారితో తనకు పరిచయం ఉందనీ చెప్పారు. రాజశ్రీ వారి వెబెసైట్ విజయపథంలో సాగాలని కోరుకుంటున్నానని అన్నారు. సినిమా అనేది కేవలం వెండితెరకే కాకుండా టీవీ, మొబైల్ స్క్రీన్, కంప్యూటర్స్ తెరపై కనిపిస్తోందనీ, మరో ఐదేళ్లలో ఇంటర్నెట్ లో సినిమా ప్రదర్శన అనే అంశానికి చాలా క్రేజ్ వస్తుందనీ సురేష్ బాబు పేర్కొన్నారు. నిర్మాతలందరూ తమ సినిమాలకు సంబంధించిన హక్కులు తమ వద్దే ఉంచుకుంటే ఆదాయం వచ్చే మార్గమవుతుందని సూచించారు.
Be first to comment on this News / Article!
|